వివాదంలోకి జొమాటో.. ఆర్డర్ ఇచ్చిన మహిళ ఇంట్లోకి వెళ్లి పిడిగుద్దులు


అవసరమైన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం.. ఆ వెంటనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజా ఉదంతంలో డెలివరీ బాయ్ మహిళపై దాడి చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. చిన్న విషయానికే రక్తం వచ్చేలా కొట్టటమే కాదు.. తీవ్ర గాయానికి పాల్పడిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

బెంగళూరుకు చెందిన హితేషా మేకప్ ఆర్టిస్ట్ గా.. కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తుంటారు. ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంటే.. సమయానికి చేయలేదని.. దీంతో ఆర్డర్ ఆలస్యం కావటంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి క్యాన్సిల్ చేయాలని కోరారు.

అయితే.. అంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో.. డెలివరీ బాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. ఆమెపై దాడికి దిగాడు. ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తాను తెచ్చిన ఆర్డర్ ను తీసుకొని పారిపోయాడు.

తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి ఇన్ స్టాలో షేర్ చేసుకున్న ఆమె.. ఒక వీడియోను షేర్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.