అరుదైన పరిణామం చోటు చేసుకుంది. దేశ అత్యున్న న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ శరద్ బోబ్డేను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు భారీగా వినిపిస్తోంది. అత్యాచారం కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ నోట వచ్చిన మాటపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. అసలేం జరిగిందంటే..
ముంబయికి చెందిన మొహిత్ సుభాష్ అనే ప్రభుత్వ ఉద్యోగి స్కూల్లో చదువుతున్న బాలికను పదే పదే బెదిరించి అత్యాచారం చేశాడు. అంతేకాదు.. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే పెట్రోల్ పోసి తగలబెడతానని.. యాసిడ్ పోసి ముఖాన్ని కాల్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ దారుణం బయటకు పొక్కటం.. కేసు విచారణకు కోర్టుకు రావటం జరిగాయి. ఆ వ్యక్తికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కింది కోర్టు తీర్పు ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు నిలిపేసింది. దీంతో.. ఇష్యూ సుప్రీంకు చేరుకుంది.
విచారణలో భాగంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నోటి వెంట అనూహ్యమైన వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై పెను దుమారం రేగింది. ‘‘నువ్వు ఆ బాలికను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానంటే మేం నీకు సాయపడతాం. లేదంటే నువ్వు జైలుకెళ్లాల్సి వస్తుంది. నీ ఉద్యోగమూ పోతుంది. నువ్వు ఆమెను వశపర్చుకుని అత్యాచారం చేశావు.. ఆలోచించుకో. ‘పెళ్లి చేసుకో…’ అని మేమేమీ బలవంత పెట్టడం లేదు’ అని సీజే బోబ్టే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రేపిస్టుకు నెల రోజులు గడువు ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. రేపిస్టును నెల రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇవ్వటంపైనా నిరసన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఇప్పటికే సదరు రేపిస్టుకు పెళ్లైపోవటం గమనార్హం. దీనిపై బాధితురాలి తరఫు పలువురు మహిళా ప్రముఖులు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సిద్ధం చేశారు. తీవ్రంగా రేప్ చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా ఫర్లేదన్న మాట.. పెళ్లైన వ్యక్తి చేసిన ఇలాంటి అత్యాచారాల్ని సమర్థిస్తారా? లోబర్చుకోవటం.. అత్యాచారం.. పెళ్లి.. ఇలాంటి వాటికి అర్థాలను బాధిత మహిళలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే చెప్పాల్సిన రావటమా? అని ప్రముఖులు పలువురు తాము రాసిన బహిరంగ లేఖలో తప్పు పట్టారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.