కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ అగ్రరాజ్యం అమెరికా మీద మామూలుగా పడలేదు. యావత్ ప్రపంచంలో కరోనా దెబ్బకు బాగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉంటే అమెరికాను మొదట చెప్పుకోవాలి. అగ్రరాజ్యంలో కరోనా దెబ్బకు సుమారు 2.8 కోట్లమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఇదే సమయంలో 5 లక్షలమంది చనిపోయారు. ఇవి కాకుండా సుమారు 4 కోట్లమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఒక ప్రాణాంతక వైరస్ కారణంగా అమెరికా ఇంతలా వణికిపోవటం మిగిలిన ప్రపంచానికి ఆశ్చర్యంగా ఉంది.
ప్రపంచంలో తానే సూపర్ పవర్ అని తనను మించిన దేశం మరేదీ లేదని విర్రవీగే అమెరికా కూడా కంటికి కనిపించని వైరస్ కారణంగా మిగిలిన ప్రపంచదేశాల్లాగే వణికిపోయింది. మామూలుగా అయితే వైద్య, ఆరోగ్య రంగంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో తామే మేటి అంటు అమెరికా చెప్పుకోవటం అందరు చూసిందే. కానీ కరోనా వైరస్ దెబ్బకు అవేవీ పనికిరాలేదు.
లక్షలమంది రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవాటినికి యాజమాన్యాలు అంగీకరించక బయటనుండి బయటకు పంపేసిన ఘటనలు అమెరికాలో కొన్ని వందలు జరిగాయి. చనిపోయిన వందలాదిమందిని సామూహిక దహనాలు చేయాల్సొచ్చింది. దహనాలు చేయటానికి చోటు దొరక్క, ఆసుపత్రుల్లో మార్చురీలు లేక వందలాది మృతదేహాలను ఆసుపత్రులు, మార్చురీనీ వరండాల్లోనే వారాల తరబడి అట్టేపెట్టేయటం అమెరికాలో సంచలనం కలిగించింది.
అమెరికాను ఇంతలా వణికించేసిన కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు చివరకు 5 లక్షల మంది చనిపోయారు. ఇన్ని కోట్లమంది వైరస్ బారినపడటం, లక్షాలాదిమంది చనిపోవటం ప్రపంచంలోని మరేదేశంలోను కనబడలేదు. వైద్యారోగ్య రంగంలో వెనకబడిన దేశాల్లో కూడా ఇన్ని లక్షలమంది చనిపోలేదు. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా అమెరికా డొల్లతనమేమిటో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఏదేమైనా ఇన్ని లక్షలమంది చనిపోవటం మాత్రం బాధాకరమే.