పెట్రోల్ సెంచరీ.. క్రికెటర్ పేలిపోయే పంచ్

ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. కానీ ఇది సంతోషించాల్సిన రోజేమీ కాదు. దేశంలో కొన్ని నెల‌లుగా శ‌ర‌వేగంగా పెరుగుతున్న పెట్రోలు ధ‌ర.. ఇప్పుడు కొన్ని న‌గ‌రాల్లో ఏకంగా రూ.100 మార్కును ట‌చ్ చేసింది. ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ పెట్రోలు, డీజిలు ధ‌ర‌లు పెరగ‌డం మామూలే కానీ.. మోడీ స‌ర్కారు హ‌యాంలో, ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక అసాధార‌ణంగా రేట్లు పెరుగుతూ వ‌చ్చాయి. గ‌త రెండు నెల‌ల్లోనే అసాధార‌ణంగా ధ‌ర‌లు పెరిగి పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిపోయింది.

పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ కొట్ట‌డం ముందు నుంచి ఊహిస్తున్న‌దే. ఈ నేప‌థ్యంలో ఆ సంద‌ర్భం వ‌చ్చిన‌పుడు వినియోగ‌దారులు బండి ఆపి హెల్మెట్ తీసి ఆకాశంలోకి చూస్తూ అభివాదం చేయాల‌ని, సెంచ‌రీ చేసిన‌పుడు క్రికెట‌ర్లు ఇలాగే చేస్తారని ఒక జోక్ కొన్ని రోజుల కింద‌ట హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇప్పుడు ఆ సంద‌ర్భం వ‌చ్చేస‌రికి కొంద‌రు నిజంగా అలాగే చేసి ప్ర‌భుత్వం మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ సెంచ‌రీ మీద ఇలాంటి జోకులు మ‌రెన్నో పేలుతున్నాయి. కాగా ఒకప్పుడు భార‌త జ‌ట్టుకు కూడా ఆడిన ప‌శ్చిమ బెంగాల్ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి క్రికెట్ భాష‌లో పెట్రోల్ సెంచ‌రీ మీద వేసిన ఒక కౌంట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది

Wat an innings by Petrol so far. A well-compiled century on dis difficult situation. U looked 4 a big one d moment u played ur first ball. Equally supported by Diesel. Great partnership by u 2. Wasn’t easy playing against d common people but u both did it… ఇదీ మ‌నోజ్ తివారి వేసిన ట్వీట్. అచ్చంగా క్రికెట్ భాష‌లో పెట్రోల్ సెంచ‌రీ గురించి సెటైర్ వేశాడు మ‌నోజ్.

క్రికెట్ కామెంట్రీ ఫాలో అయ్యే వాళ్ల‌కు ఇది భ‌లేగా క‌నెక్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. బెంగాల్ మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుకు మ‌నోజ్ మ‌ద్ద‌తుదార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అత‌నిలా కౌంట‌ర్ వేశాడు. ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది సోష‌ల్ మీడియాలో.