చిరు లీక్స్ రొటీన్ అవుతున్నాయా

మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఒక్కోసారి యూత్ హీరోలా మారిపోయి జోకులు వేయడం ఎన్నో సార్లు ఆ ఈవెంట్లకు అందం తీసుకొచ్చింది. ఒక శుభముహుర్తంలో చిరు లీక్స్ అంటూ తన సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫోలు పబ్లిక్ లో చెప్పడం మొదట్లో బాగా పేలింది. కానీ తర్వాత క్రమంగా ఇది రొటీన్ అవుతోందనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకుల్లో మొదలయ్యింది. దీనికి కారణం లేకపోలేదు.

ఆచార్య టైటిల్ ని బ్రహ్మాజీ కొడుకు మూవీ వేడుకలో లీక్ చేసిన చిరు అప్పటికే అది లీకైన విషయాన్ని గుర్తించకుండా అంత ఓపెన్ గా చెప్పేయడం వీడియో రూపంలో బాగా వైరలయ్యింది. తర్వాత వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ లాంటివాటికి కూడా ఏదో ఒక సమాచారం ఇస్తూ ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించారు. తాజాగా ఇట్లు అర్జున థాంక్స్ మీట్ లో మాట్లాడుతూ కాకాలో అనస్వర రాజన్ పాత్రకు మాటలు ఉండవు, మూగమ్మాయి అని చెప్పీ చెప్పకుండా చెప్పేశారు. ఇక్కడో ట్విస్టు ఉంది.

కాకా షూటింగ్ మొదలైన కొత్తలోనే అనస్వర క్యారెక్టర్ కు డైలాగులు ఉండవని, కథలో ఇది చాలా ఎమోషనల్ బ్లాక్ అవుతుందనే వార్త బయటికి వచ్చింది. తర్వాత దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు హఠాత్తుగా చిరు ఆ మలుపుని చెప్పేసి షాక్ అవ్వండి అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టారు. నిజానికి లీకైన విషయం ఆయనకు తెలియక పోవచ్చు. టీమ్ సభ్యులు చెప్పి ఉండకపోవచ్చు. కానీ గ్రౌండ్ లో ఉన్న మెగాభిమానులకు ఎప్పుడో తెలుసు కాబట్టి అంతగా ఎగ్జైట్ అవ్వలేదు.

పెద్దాయనే కానీ చిరంజీవి ఇకపై లీక్స్ కాకుండా ఏదైనా కొత్త తరహా మ్యానరిజం అందుకుంటే బాగుంటుందేమో. లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా లీక్స్ అన్నప్పుడు జనాలు లైట్ తీసుకునే ప్రమాదముంది. అన్నట్టు కాకా నలభై అయిదు రోజుల్లో వస్తుందంటూ మరోసారి నొక్కి చెప్పిన చిరంజీవి సంక్రాంతికి ఇదే ఫిక్స్ అని అధికారికంగా క్లారిటీ ఇచ్చేసినట్టే. మరి విశ్వంభర సంగతి ఏంటని మాత్రం ఎవరూ అడిగే సాహసం చేయరు. మెగాస్టార్ కూడా దాని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు.