వైసీపీ ట్రాప్‌.. చిక్కుకుపోయిన టీడీపీ..?

రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ స్థానిక నేత‌లు ప‌న్నిన వ్యూహానికి టీడీపీ నేత‌లు చిక్కుకుపోతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. స‌హ‌జంగా ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌హీనంగా ఉన్న చోట అధికార ప‌క్షం పైచేయి సాధిస్తుంది. ఏక‌గ్రీవం ఏసుకోవ‌డ‌మో.. లేక పోటీకి నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల ఓట్లు ద‌క్కించుకోవ‌డ‌మో.. కామ‌న్‌గా జ‌రుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ నేత‌ల‌కు చిక్కిన టీడీపీనాయ‌కులు పంచాయ‌తీల‌ను పంచుకున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు..
ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో వైసీపీకి బ‌లం త‌క్కువ‌గా ఉంది. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేసినా విజ‌యం ద‌క్కించుకుంటారు. కానీ, ఇక్క‌డే వైసీపీ నాయకులు ఎంట్రీ ఇచ్చి.. టీడీపీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు లేకుండా..  మొదటి రెండన్నరేళ్లు టీడ‌పీ బలపరిచిన అభ్యర్థి, తర్వాత రెండున్నరేళ్లు వైసీపీ మద్దతుదారుకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప‌రిణామం.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను డీలా ప‌డేసింది. ఏమాత్రం పోటీలో లేని వైసీపీతో రాజీ చేసుకోవ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, ఇదే జిల్లాలోని మైలవరంలోని నాలుగు, విజయవాడ రూరల్‌తోపాటు రెండు, మూడో విడతల్లో ఎన్నికలు జరిగే మిగతా 11 మండలాల్లోనూ.. ఏకగ్రీవాల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ, వైసీపీ నేత‌లు… టీడీపీ నేత‌ల‌తో చ‌ర్చించ డంతో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఈ క్ర‌మంలో ఒప్పందాలు చేసుకుని వార్డులు పంచుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విష‌యం ఎమ్మెల్యేకి తెలిసినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మాత్రం అవ‌గాహ‌న‌ను స‌మ‌ర్థిం చుకుంటున్నారు. వివాదాల‌కు తావులేకుండా ప‌నిచేసేందుకు ఇలా చేయ‌డం త‌ప్పుకాద‌ని అంటున్నారు.

కృష్ణాజిల్లా ప్రసాదంపాడులో టీడీపీ, వైసీపీ నేత‌లు కూడా ఇలానే ఏక‌గ్రీవాలు చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి వ్యవహారం వెళ్లడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో పంచుకునే వ్యవహారం బెడిసికొట్టింది. ఎన్నికలకు రెండు వర్గాలు సిద్ధమవుతున్నాయి. నందిగామ నియోజకవర్గం గనిఆత్కూరు పంచాయతీలో కూడా వైసీపీ నాయ‌కులు పంచుకున్నారు. ఉపసర్పంచితో పాటు 10 వార్డుల్లో మూడు వైసీపీకి, మిగిలిన వాటిని టీడీపీ ద‌క్కించుకునేలా ఒప్పందం కుద‌ర‌డం గ‌మ‌నార్హం.