కాకినాడ‌, శ్రీకాకుళంపై పట్టు వదలని పవన్!

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మిగిలిపోయిన కార్పొరేష‌న్ స్థానాల‌కు, అలానే మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కూట‌మి పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. జ‌న‌సేన రెండు కార్పొరేష‌న్లు, మూడు మునిసిపాలిటీల‌లో పోటీ చేస్తుండ‌గా.. బీజేపీ ఒక కార్పొరేష‌న్ స్థానం స‌హా కావ‌లి, బాప‌ట్ల మునిసిప‌ల్ చైర్మ‌న్ స్తానాల‌ను ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయా స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ ఆదివారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పార్టీల త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన వారిని గెలిపించే బాద్యత జిల్లాల నాయ‌క‌త్వానిదేన‌ని ఇరు పార్టీలూ ప్ర‌క‌టించాయి. కూట‌మి ఐక్య‌త‌కు భ‌గ్నం క‌లిగించ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించాయి.

జనసేన పార్టీ త‌ర‌ఫున‌ కాకినాడ, శ్రీకాకుళం మేయర్ స్థానాలలో పోటీ చేసేందుకు ఇద్ద‌రినీ మ‌హిళ‌ల‌నే ఎంపిక చేసింది. ఆయా స్థానాల‌కు మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ చేయ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణిని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంపిక చేశారు. అలానే కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆకుల భ‌వానీని ఎంపిక చేశారు. ఇక‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానాల విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌న‌గరం జిల్లా రాజాం మునిసిప‌ల్ స్థానం నుంచి బ‌నిశెట్టి సౌజ‌న్య‌ల‌త‌, భీమ‌వ‌రం స్థానం నుంచి చుండూరు మ‌ల్లేశ్వ‌రి, తాడేప‌ల్లి గూడెం మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానం నుంచి పాలూరు వెంక‌టేశ్వ‌ర‌రావ‌కు అవ‌కాశం క‌ల్పించారు.

రాజ‌మండ్రి పీఠం బీజేపీదే!

తొలి నుంచి కూట‌మి పార్టీల్లో చ‌ర్చ‌కు దారితీసిన రాజ‌మండ్రి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠాన్ని బీజేపీ కైవ‌సం చేసుకుంది. కూట‌మి త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థి రేలంగి శ్రీదేవి పోటీ చేయ‌నున్న‌ట్టు బీజేపీ ఏపీ చీఫ్ మాధ‌వ్ ప్ర‌క‌టించారు. కాగా.. ఈ స్థానంపై టీడీపీ గ‌ట్టిపోరాటం చేసింది. స్థానికంగా రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉండ‌డంతో ఈ స్థానాన్ని త‌మ‌కే ఇవ్వాల‌ని కోరారు. అదేస‌మ‌యంలో రాజ‌మండ్రి ఎంపీగా బీజేపీ సీనియ‌ర్ నేత పురందేశ్వ‌రి ఉండ‌డంతోపాటు.. సీనియ‌ర్లంతా ప‌ట్టుబ‌ట్టి.. ఈ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. అయితే.. టీడీపీ, జ‌న‌సేన‌ల ప్ర‌భావంతోపోలిస్తే.. బీజేపీకి ఇక్క‌డ ప‌ట్టు తక్కువ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో `అనంత‌పురం` వంటి సీన్ రిపీట్ అవుతుందా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.