వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ పార్టీ మీద రకరకాల విమర్శలు ఎక్కుపెట్టారు. బ్రాండెడ్ పొలిటీషియన్ కేఏ పాల్ అయితే తనదైన శైలిలో విరుచుకొని పడ్డారు. పార్టీ పేరును కూడా వొదిలిపెట్టకుండా ఉతికి పారేశారు. నువ్వు దోచుకున్నది దాచుకోడానికే పార్టీ పెట్టావని, నువ్వు బీజేపీ వొదిలిన బాణం అని మాకు తెలుసులే అని కామెంట్స్ చేశారు. ఇంతకూ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ ఏమన్నారంటే..
వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇక రాజకీయాలకు దూరంగా వుంటాను, ప్రశాంతంగా కొంతకాలం వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి అంతలోనే మాటమార్చి కొత్త పార్టీ పెట్టడం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు, అక్కడ నుంచి హైదరాబాద్ వరకు నీకు ఎన్ని భూములున్నాయో, ఎంత దోచుకున్నావో మాకు తెలుసులే అని కుండబద్దలు కొట్టారు. దోచుకున్నది దాచుకోడానికే కొత్త పార్టీ పెడుతున్నాడని ఆరోపించారు.
విజయసాయి రెడ్డి దోపిడి మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సీబీఐ ఎందుకు విచారించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి నిజాయితీ వుంటే దోచుకున్నదంతా పేదలకు పంచి పెట్టాలని, ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో వున్న సంబంధాల వల్లనే ఆయనను సీబీఐ విడిచి పెట్టిందన్నట్టు కేఏ పాల్ మాట్లాడారు. విజయసాయి రెడ్డి బీజేపీ వొదిలిన బాణం అని ఆరోపించారు. ఎప్పుడు మాట్లాడినా మతాలు, కులాల గురించి మాట్లాడటం ద్వారా విభజన రాజకీయాలు చేయనున్నట్లు ఆయన సంకేతాలు ఇస్తున్నాడని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 12 మంది రెడ్లు పరిపాలించారని చెప్పిన పాల్ ” ఎప్పుడూ మీరే పాలించాలా… 60 శాతం వున్న బీసీలకు, 27 శాతం వున్న కాపులకు అవకాశం ఇవ్వరా… మాకు చేతకాదా ” అని ప్రశ్నలను సంధించారు. ముందుగా విజయసాయి రెడ్డిలో పరివర్తన రావాలని, ఆ తర్వాత రాజనీతి గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేఏ పాల్ విమర్శలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
