ఎట్టకేలకు విజయసాయి రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టేశారు. ముందే చెప్పినట్టు 11:11:11 కు పరివర్తన్ రాజనీతి పార్టీ అని కొత్త పార్టీ ప్రకటించారు. పీఆర్పీ అనే పేరే కాకుండా జెండా కూడా అచ్చం చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని పోలి ఉన్నట్లు చర్చ జరుగుతుంది. పార్టీ ప్రకటించిన తర్వాత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీ ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు.
గతంలో సాయిరెడ్డి అనేక సార్లు హిందుత్వ అనుకూల ప్రకటనలు చేయడంతో ఆయన బీజేపీ తానులో గుడ్డే అనే ముద్ర పడిపోయింది. దాంతో ఆయన కొత్త పార్టీ పట్ల అపోహలు తొలిగించే ప్రయత్నం చేశారు. పీఆర్పీ ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
దానికి నిదర్శనంగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కడప, కదిరి, రాయచోటి, హిందూపూర్, మదనపల్లి నియోజకవర్గాల నుంచి ముస్లిం సోదరులకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ముస్లింలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందుకే పార్టీ ప్రారంభ వేదిక మీద నుంచే వారికి పార్టీ సీట్లు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే తమ పార్టీ క్రిస్టియన్లకు కూడా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నేను క్రిస్టియన్ వ్యతిరేకిని అని కొందరు ప్రచారం చేస్తున్నారని, నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదన్నారు. అయితే బలవంతపు మత మార్పిళ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా సరే డబ్బుల కోసమో, ఇతరా ప్రయోజనాల కోసమో మతం మారడం తప్పని, మత మార్పిళ్ల కోసం ప్రలోభాలు పెట్టడం తప్పని చెప్పారు. భారతీయుడు ఎవరైనా తన ఇష్టానుసారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, నచ్చిన విశ్వాసాన్ని పాటించవచ్చన్నారు.
విజయసాయి రెడ్డి మైనార్టీలనుద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలకు భిన్నమైన స్పందన వస్తుంది. ముస్లింలకు దామాషా ప్రకారం మొత్తం ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పకుండా రాయలసీమలో కొన్ని సీట్లను మాత్రమే ఇస్తామని ప్రకటించడం పట్ల ముస్లిం సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక క్రిస్టియన్ మతం బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నట్లు అర్ధం వచ్చేలా ఆయన ప్రసంగం చేశారని క్రిస్టియన్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రెడ్డి కులస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడేవిధంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను కొందరు మేధావులు గుర్తు చేస్తున్నారు. ఒక కులం గురించి మాట్లాడుతున్న ఆయన అన్నీ కులాలకు, మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం బూటకమని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నుంచి గెంటి వేశారన్న కోపం, టీడీపీలోకి చేరనివ్వకుండా అడ్డుకున్నారన్న ఆగ్రహంతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న విజయసాయి వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి వుందని చెబుతున్నారు. ఇది ఒక పార్ట్ టైం పార్టీ అని, ఎవరు జాబ్ వర్క్ అప్పగిస్తే వారికి పనిచేసి పెట్టే కాంట్రాక్ట్ బేసిక్ పార్టీ అని మరికొందరు విమర్శిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
