‘దొంగ నా కొడుకు’ వద్దంటే… ‘నా కొడుకు దొంగ’

ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు సెన్సార్ సభ్యులు. కొన్ని సినిమాలకు రిలీజ్‌కు కొన్ని రోజుల ముంగిట టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా కల్పిస్తున్నారు. వానర, హే భగవాన్ లాంటి సినిమాలు ఇలాగే వనవీర, హే బల్వంత్ అని టైటిళ్లు మార్చుకున్నాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు కూడా టైటిల్ మార్చుకోకుంటే ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందని అంటే.. ఆ టీం రాజీ పడకుండా అదే పేరుతో సినిమాను రిలీజ్ చేసింది.

ఇప్పుడు ఇంకో చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పేరు మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఆకట్టుకున్న మౌళి హీరోగా ‘దొంగ నా కొడుకు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నవంబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ లోపు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని చూసిన టీంకు షాక్ తగిలినట్లు సమాచారం.
ఐతే ఈ సినిమా‌ను సెన్సార్ స్క్రీనింగ్‌కు పంపగా.. టైటిల్‌ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట.

బహుశా ‘దొంగ నా కొడుకు’ అన్నది తిట్టు కావడంతో దాన్ని టైటిల్‌గా పెట్టడాన్ని వ్యతిరేకించినట్లున్నారు. కానీ అదేం పెద్ద బూతైతే కాదు.. దీని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటో అర్థం కాని విషయం. ‘దొంగ నా కొడుకు’ సినిమాను ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ అయినా.. ఇలాంటి ఇబ్బంది రావడం ఆశ్చర్యమే.

ఐతే ఎంత వారైనా సెన్సార్ బోర్డుకు తలవంచక తప్పదు కాబట్టి.. టైటిల్ మార్చుకోక తప్పని పరిస్థితి. దీంతో ‘నా కొడుకు దొంగ’ అని పేరు మార్చి సినిమాను రిలీజ్ చేయడానికి టీం రెడీ అయిపోయిందట. ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ గాలి వాటం కాదని రుజువు చేయాల్సిన స్థితిలో.. మౌళి ఆచితూచి ఈ సినిమాను ఎంచుకున్నాడు. ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ రోజే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.