యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక అతను హీరో అవతారం ఎత్తిన లిటిల్ హార్ట్స్ మూవీ గత ఏడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాస్తా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
ఇప్పుడు మౌళి నుంచి దొంగనాకొడుకు సినిమా రాబోతోంది. ఈ రోజే రిలీజైన దీని టీజర్ యూత్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లాంచ్ సందర్భంగా మౌళి.. కొన్ని ఆసక్తికర విషయాల గురించి మాట్లాడాడు. ఈ మధ్య ఒక టీవీ ఛానెల్ యాంకర్ తనను ఉద్దేశించి అవమానించేలా మాట్లాడ్డం.. అలాగే ఇంకో టీవీ ఛానెల్ ప్రతినిధి తనను బ్లాక్‌మెయిట్ చేయడం గురించి కూడా అతను స్పందించాడు.
ముందుగా తన గురించి ఒక యాంకర్ అవమానకంగా మాట్లాడ్డం గురించి మౌళి మాట్లాడుతూ.. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గురించి అయితే అలాంటి కామెంట్ చేసేవాడా అని ప్రశ్నించాడు. ఆ వీడియో చూసి తాను బాధపడ్డానని, కానీ ఏం చేయగలం అని అతను ఒకింత నిర్వేదంతో మాట్లాడాడు.
ఆ టైంలో స్పందించకపోవడమే మంచిదని ఊరుకున్నట్లు అతను చెప్పాడు. లిటిల్ హార్ట్స్ రిలీజయ్యాక చాలామంది రకరకాలుగా మాట్లాడారని.. కొందరు అసూయ పడ్డారని, తన గురించి తప్పుగా కామెంట్ చేశారని, అదే సమయంలో తనకు సపోర్ట్ కూడా వచ్చిందని మౌళి తెలిపాడు.
ఇక తాను ఎదుర్కొన్న బ్లాక్‌మెయిల్ గురించి మౌళి చెబుతూ.. లిటిల్ హార్ట్స్ రిలీజయ్యాక ఒక టీవీ ఛానెల్ ప్రతినిధి ఒక ప్రోగ్రాంకు పిలిచాడని.. ఐతే అప్పుడు తనకు జ్వరం ఉందని చెబితే.. అవునా, అయితే రావా, అలా అయితే నీ తర్వాతి నెగెటివ్ అవుతుందేమో చూస్కో అని నేరుగా ముఖం మీదే అన్నాడని వెల్లడించాడు. దీంతో ఒంట్లో బాలేకున్నా, భయంతో ఆ ప్రోగ్రాంకు వెళ్లానని.. భయపెడితే భయపడతాం, తిడితే పడతాం, అంతకంటే ఏం చేస్తాం అని అతను వ్యాఖ్యానించాడు. దొంగనాకొడుకు నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానునన్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates