ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు ఎన్ని ఉన్నా పట్టించుకునేవారు కాదు. దానవీరశూరకర్ణ ఒక సీన్లో తాళ్లు వేలాడుతూ ఉండగా, సమయం లేక వాటిని ఎడిటింగ్ లో తీయలేకపోయారు. అయినా సరే ఎన్టీఆర్ విశ్వరూప తన్మయత్వంలో ఉన్న జనాలు దాన్ని పట్టించుకోలేదు. బ్రహ్మరథం పట్టి కోట్ల వర్షం కురిపించారు. కానీ ఇప్పుడలా కుదరదు. అందులోనూ సామాన్యుల చేతికి ఏఐ వచ్చిన తర్వాత మరీ కష్టమైపోయింది.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం మహాశక్తి మూవీ. దీపావళి కానుకగా నవంబర్ 6 విడుదల చేయబోతున్నారు. ఒక రోజు ముందు రామాయణ లాంటి గ్రాండియర్ ఉన్నప్పటికీ పోటీ సై అంటున్నారు. ట్రైలర్ కూడా వచ్చేసింది. అధిక శాతం ఏఐతో రూపొందించినట్టుగా విజువల్స్ ఉన్నాయని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు సుందర్ సి గతంలో చంద్రకళ, కళావతి లాంటి హారర్ సినిమాలతో మాస్ మార్కెట్ లో బిజినెస్ బాగానే చేసుకున్నారు. ఇప్పుడీ మహాశక్తితో వస్తున్నారు.

గతంలో ఓటిటి రిలీజ్ జరుపుకున్న మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి)కి సీక్వెల్ గా ఈ మహాశక్తి వస్తోంది. మొదటి భాగంకి దర్శకత్వం వహించిన ఆర్జె బాలాజీ సూర్య వీరభద్రుడు కమిట్ మెంట్ తో పాటు ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టుని వదులుకున్నారు. ఆ స్థానంలో సుందర్ సి వచ్చారు. వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టామని నిర్మాతలు చెబుతున్నారు కానీ క్వాలిటీ చూస్తేనేమో అంత ఖర్చు నిజంగా అయ్యిందానే అనుమానాలు వచ్చేలా ఉందని ట్విట్టర్ జనాల కామెంట్.

టైటిల్ రోల్ నయనతార పోషిస్తుండగా రెజీనా కసెండ్రా, దునియా విజయ్ విలన్లుగా నటించారు. సూర్య సీన్ తో క్లాష్ అవుతున్న ఈ మహాశక్తిలో నయన్ కానిస్టేబుల్ గా నటిస్తోంది. ప్రపంచానికి దుర్మార్గుల వల్ల ప్రళయం ముంచుకు వచ్చినప్పుడు దాన్ని కాపాడేందుకు అమ్మోరు తల్లి ఆ పోలీస్ ఒంట్లోకి వస్తుంది. ఆ తర్వాత జరిగేది ఊహించుకోవచ్చు. క్వాలిటీ సంగతి పక్కనపెడితే ఒక్కోసారి ఇలాంటి ఊరమాస్ డివోషనల్ డ్రామాలు వర్కౌట్ అవుతుంటాయి. మహాశక్తి ఆ కోవలోకి వస్తుందేమో చూడాలి.