బిట్టు కష్టం వృథా అయిపోయింది

బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా…. అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే. అతడేనండి. అతడు ఎనిమిది నెలలు కష్టపడి నదిని శుభ్రం చేశాడు. జనం మాత్రం ఎనిమిది రోజుల్లో కలుషితం చేసిపడేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ గడ్ జిల్లా బియోరా పట్టణంలో అజ్నార్ అనే నది వుంది. ఎంతో అందమైన ఆ నది చెత్తా చెదారంతో నిండిపోవడం ఆ ఊరిలో డిగ్రీ చదువుకునే సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టూ తబాహికి నచ్చలేదు. ఏదో ఒకటి చేసి నదిని శుభ్రం చేయాలని అనుకున్నాడు. కానీ అతడికి ఈత రాదు. నీళ్లలోకి దిగాలంటే భయం. దానికి తోడు నదిని శుభ్రం చేసే పరికరాలు కోనేందుకు కూడా అతడి వద్ద డబ్బులు లేవు. కనీసం గ్లౌజులు, బూట్లు కూడా ధరించడానికి ఆర్ధిక స్తొమత సహకరించలేదు.

అయితేనేం అతడికి మనసుంది. అంతకుమించి పట్టుదల వుంది. తను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్న తపన వుంది. అందుకే అజ్నార్ నదిని శుభ్రం చేయాలని కృతనిశ్చయం నదిలోకి దిగాడు. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది నెలలు శ్రమించాడు. అప్పుడే పుట్టిన బిడ్డలా నదిని శుభ్రం చేశాడు. నదిలోని టన్నులకొద్ది ప్లాస్టిక్ వ్యర్ధాల్ని ఒక్కడే తొలిగించాడు. ఒంటినిండా బురదను రాసుకున్నా, చెత్తలో కాళ్ళు ఇరుక్కొని పోయినా ఒంటరిగానే కష్టపడ్డాడు.

బిట్టూ నదిని శుభ్రం చేసేందుకు నదిలోకి దిగిన రోజున బంధు మిత్రులు, పట్టణ ప్రజలు అతడ్ని పట్టించుకోలేదు. పైగా బుద్దిగా చదువుకోకుండా ఇదేం పని అంటూ విమర్శలు చేశారు. బయలుదేరాడు రా పెద్ద మహానుభావుడు అంటూ ఎద్దేవా చేశారు. అతడు నదిని శుభ్రం చేశాక ఏ నోళ్లయితే తెగిడాయో అవే నోళ్లు పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇదంతా ఒక్క వారంలోనే…

కేవలం వారం రోజుల్లోనే బియోరా ప్రజలు ఆ నదిని మళ్ళీ కలుషితం చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు పడేశారు. చెత్త వేశారు. బిట్టూ ఎనిమిది నెలల కష్టం అంతా బురదలో పోసిన పన్నీరయ్యింది. అదే చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు బిట్టూ. నా ఎనిమిది నెలల శ్రమ ఇలా వృధా అవుతుందని ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నాడు. అయినా సరే అజ్నార్ నదిని మళ్ళీ శుభ్రం చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారంటారా…???