అప్పన్న భక్తులకు ఆ డ్రస్సుల్లో నో ఎంట్రీ

సింహాచలం అప్పన్న భక్తులకు ఇక నుంచి ఆ డ్రస్సుల్లో ప్రవేశం లేదు. ఇప్పటివరకు ఆలయానికి వచ్చే భక్తులు తమకు నచ్చిన దుస్తుల్లో ముఖ్యంగా పాశ్చ్చాత్య దుస్తుల్లో గుడికి వచ్చి స్వామి వారిని దర్శించుకునేవారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. గత కొన్ని రోజులుగా భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుంతున్నాయి. కనీసం పవిత్రమైన ఆలయానికి వచ్చే సమయంలోనైనా సంప్రదాయం పాటించకపోతే ఎలా అని పలువురు పెద్దలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి మోడ్రెన్ దుస్తుల్లో ప్రవేశం లేదని ప్రకటించింది. 

డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దైవ సన్నిధికి వచ్చే భక్తులు హుందాగా, సంప్రదాయబద్ధంగా రావాలని, జీన్స్, టీషర్టులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ వంటి ఆధునిక వస్త్రాలు ధరించి రావడం సరైన పద్దతి కాదని దేవాలయ కమిటీ, అధికారులు ప్రకటించారు. ఇకనుంచి మగవాళ్లైతే తప్పనిసరిగా ధోతీతో పాటు అంగవస్త్రం గానీ, కుర్తా పైజామా గానీ ధరించాలని తెలిపారు.

ఒకవేళ అవి కనుక అందుబాటులో లేకపోతే రెగ్యులర్ గా వినియోగించే ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకుని ఆలయానికి రావాల్సిన ఉంటుంది. అలాగే మహిళలైతే చీర, లంగావోణీ,  చున్నీతో చుడీదార్ మాత్రమే ధరించి గుడికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏదేమైనా ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత భక్తులపై ఉందని, ప్రతి ఒక్కరూ దాన్ని గమనించాలని కమిటీ పెద్దలు కోరారు.

ఈ నిబంధనలు సాధారణ దర్శనాలకు మాత్రమే వర్తిస్తాయి అనుకుంటే పొరపడినట్టే. పెళ్లి, ఇతరా శుభకార్యాల్లో పాల్గొనేవారు కూడా ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పెళ్లి కదా.. మేము స్లివ్ లేస్ లో వస్తాం, జీన్స్ లో వస్తాం అంటే కుదరదని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. ప్రపంచంలో సనాతన ధర్మానికి ఎంతో విలువ, గౌరవం వుందని, పాశ్చత్యులు సైతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపుతుంటే మన భారతీయులు మాత్రం ఫారిన్ ఫ్యాషన్లపై మోజుతో  సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆలయ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.