అస్సాం నుండి ఆంధ్రా వచ్చి పట్టాలపై శవమైంది

డాన్స్ పోటీలో పాల్గొనేందుకు అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఓ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై శవమై కనిపించడం కలకలం సృష్టిస్తోంది. అంతకుముందు ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ప్రయాణిస్తున్న ట్రైన్లో మద్యం సేవించిన వ్యక్తులు ఎక్కరని , ఎందుకో తనకు సేఫ్ గా వున్నట్లు అనిపించడం లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. దాంతో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలికపై అఘాయిత్యం జరిగిందా, లేక ప్రమాదవశాత్తు జారిపడి మరిణించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అస్సాంలోని కామరూప్ జిల్లా, గౌహతిలోని బి. బోరూవా కాలేజీ విద్యార్థిని 21 ఏళ్ళ హిమాశ్రీ బోరోకు డ్యాన్స్ లో మంచి ప్రావిణ్యం వుంది. డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చింది. అయితే ఈనెల 10 వ తేదీన ఒక బ్యాంక్ పరీక్ష కోసం అక్టోబర్ 6వ తేదీ రాత్రి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఒంటరిగా స్వస్థలమైన గౌహతికి బయలుదేరింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఎస్ 2 కోచ్ లో మద్యం సేవించిన పురుషులు ఎక్కారు. వారిలో కొందరు హిమాశ్రీ ని వేధించడం మొదలుపెట్టారు. మరికొందరు అసభ్యంగా సైగలు చేస్తూ ఇబ్బందికి గురి చేశారు.

దాంతో హిమాశ్రీ భయాందోళనకు గురైంది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తనకు భయంగా వుందని ఏడ్చింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో స్పందించలేదని సమాచారం. హిమాశ్రీ ప్రయాణించిన రైలు గౌహతి చేరుకుంది కానీ అందులో ఆమె కనిపించలేదు. హిమాశ్రీ సీటుపై లగేజీ బ్యాగ్ మాత్రమే వుంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు గాలింపు చేపట్టారు. అక్టోబర్ 7న శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు – దూసి రైల్వే సెక్షన్ల మధ్య మలయపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ట్రాక్‌ పక్కన హిమాశ్రీ మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి వుంటే హిమాశ్రీ బతికేదేమో అని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అయితే వేగంగా కదులుతున్న రైల్లోంచి జారిపడి ఆమె మృతి చెంది ఉండొచ్చని రైల్వే పోలీసులు చెబుతున్నారు. కాదు తమ కూతురిని ఎవరో హత్య చేశారని హిమాశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే కాని వాస్తవాలు బయటకురావు. ఏదేమైనా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే చెప్పవచ్చు.