పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్ అనే యువతి ఆయనపై ఆరోపణలు చేశారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆమె చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించడంతో తమిళనాట ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమె విడుదల చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

వహిదా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే ఓ వీడియో విడుదల చేసిన ఆమె, ముత్తుకుమరన్‌తో తనకు ఉన్న పరిచయం గురించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత మాట మార్చారని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మడం వల్ల తాను మానసికంగా బాధపడ్డానని తెలిపారు. తన పరిస్థితికి సంబంధించి మరికొన్ని విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ వ్యవహారంపై తమిళ సినీ గేయరచయిత్రి తామరై కూడా స్పందించారు. ముత్తుకుమరన్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఒక యువతి ఈ విధంగా బయటకు వచ్చి తన గురించి మాట్లాడుతుందని ముత్తుకుమరన్ ఊహించి ఉండరేమోనని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని కోరారు.

మరోవైపు ముత్తుకుమరన్ ఈ ఆరోపణలపై స్పందించినట్లు కొన్ని తమిళ మీడియా కథనాలు వచ్చాయి. వహిదాతో తనకు మంచి స్నేహం మాత్రమే ఉందని, ఆమె ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని చెప్పినట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై ఆమెను వివరణ అడుగుతున్నట్లు కూడా తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వహిదా ఆరోపణలు, ముత్తుకుమరన్ స్పందనకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వెలువడుతున్నాయి.