జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా, దులమి పరిధిలోని సోసో గ్రామానికి చెందిన కవిత కుమారి గురించి ఇప్పుడు యావత్ దేశం మాట్లాడుకుంటుంది. హోం గార్డ్ ఉద్యోగం కోసం చీర కట్టి పరుగులు తీయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, కసి ప్రతి ఒక్కరినీ ఆలోచనకు గురి చేస్తోంది.
అందరిలాగే కవిత సాధారణ మహిళ. భర్త, ఇద్దరు చిన్న పిల్లలు, అత్తా మామలతో కాపురం సజావుగా కొనసాగేది. అలాంటి సమయంలో భర్త అనారోగ్యం పాలవడం ఆ కుటుంబం కలల్ని కల్లలు చేసింది. కుటుంబాన్ని పోషించే భర్త అనారోగ్యంతో మంచాన పడటంతో కవిత ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. ఒకవైపు భర్త వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేయాల్సి రావడం, మరోవైపు పిల్లల ఆలనా పాలనా చూడ్డం, అత్తా మామలకు సేవ చేయడం వంటివి ఆమెలో తెగువను తెచ్చాయి.
దీంతో ఇంటి గడప దాటని కవిత ఇటుకల బట్టీల్లో పనికి చేరింది. రోజు కూలీగా పనిచేస్తున్నా ఇళ్లు గడవడం కష్టమై పోయింది. ఇటుకలు మోస్తూనే ఒక అకాడమీలో సెక్యూరిటీ గార్డుగా, వంట మనిషిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమె భర్త మరణించడంతో పూర్తిగా ఒంటరిదైంది. అయినా వెనకంజ వేయలేదు. జీవిత పోరాటంలో కొంగు నడుముకు చుట్టి ముందుకు కదిలింది.
ఎన్నాళ్ళు కష్టపడినా అంతంతమాత్రం బతుకులతో సర్దుకొని పోవాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దడానికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది. అప్పుడే హోం గార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రామ్‌గఢ్ జిల్లాలో మొత్తం 284 హోమ్ గార్డ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. దానికి దరఖాస్తు చేసుకుంది.
హోమ్‌గార్డ్ నియామకాల కోసం శారీరక సామర్థ్య పరీక్షలను రామ్‌గఢ్‌లోని సిధో-కాన్హు మైదానంలో నిర్వహించారు. కేవలం 10 నిముషాల్లో 1600 మీటర్లు పరుగెత్తాలి. తనతో పాటు పరుగు పందెంలో పాల్గొనే మహిళలు రన్నింగ్ షూస్, ట్రాక్‌సూట్ వంటివి ధరించి వచ్చారు. కవితకు అవి కొనుక్కునే స్తొమత లేదు. ఆమె ఒట్టి కాళ్ళతో, సంప్రదాయం పద్దతిలో చీర కట్టి పరుగులో పాల్గొన్నారు. చీరలో పరుగెత్తడం అంటే మాటలు కాదు. 10 నిముషాల దురాన్ని కేవలం 6 నుండి 6:45 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసి ఫిజికల్ టెస్టులో అత్యుత్తమ మార్కులు సాధించి ఔరా అనిపించింది.
కవిత గ్రౌండ్ లో పరుగులు తీస్తుంటే మీడియా ఆమెతో పరుగులు తీసింది. సెకన్లలో ఈ దృశ్యం ప్రపంచమంతా చూసింది. ఒక చేత్తో చీరను సర్దుకుంటూ పట్టుదలతో పరుగెత్తిన దృశ్యాలు పతాక శీర్షికలకు ఎక్కింది. స్థానిక రన్నింగ్ అకాడమీ గ్రూపులు ఆమె ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సత్కరించాయి. ఉద్యోగం కోసం ఆమె ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి చీర కట్టుకునే పరుగు సాధన చేసినట్లు కవిత చెప్పిన మాటలు నేటి తరాన్ని నిద్ర లేపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates