ప్రాణాలు విడిచిన భర్తకు.. ఇప్పటి వరకు ఏ భార్యా తలకొరివి పెట్టిన సంఘటనలు జరగలేదు. ఆ దంపతులకు కుమారులు లేకపోతే.. తమ కడుపున పుట్టిన ఆడపిల్లలు తలకొరివి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లేదా.. పిల్లలు లేకపోతే.. కుటుంబ సభ్యుల్లో మగవారు అంతిమ సంస్కారం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ, తొలిసారి.. కట్టుకున్న భర్తపై వాత్సల్యంతో పిల్లలు ఉన్నప్పటికీ.. ఆయనకు తలకొరివి పెట్టిన భార్య ఘటన ఏపీలో జరిగింది.
అనకాపల్లి జిల్లాలోని మునగపాక గ్రామానికి చెందిన అడారి రవికి 50 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు న్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య లక్ష్మి, 17-20 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే.. పుత్రసంతానం మాత్రం లేదు. ఇక, రవి అంత్యక్రియల విషయానికి వస్తే.. కుమార్తెలు, రవి సోదరులు ఈ కార్యక్రమం చేసేందుకు ముందుకు వచ్చారు. డబ్బుకు కూడా ఇబ్బంది లేదు.
కానీ, రవి సతీమణి మాత్రం వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తన భర్తకు తానే అంతిమ సంస్కారం నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. ఆ వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం చేరవేశారు. వారు తొలుత అంగీకరించకపోయినా.. చివరకు తన భర్తపై లక్ష్మికి ఉన్న వాత్సల్యాన్ని గుర్తించిన గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. స్థానిక స్మశాన వాటికలో సంప్రదాయ విధానంలో తన భర్తకు లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. వీరి సామాజిక వర్గం సంప్రదాయం మేరకు భౌతిక కాయాన్ని చితిపై ఉంచి.. కొబ్బరి నీళ్లను నోటిలో పోశారు. అనంతరం.. హారతి కర్పూరాన్ని భౌతిక కాయం నుదుటిపై ఉంచి నిప్పటించారు. దీంతో అంత్యక్రియల ఘట్టం పూర్తయింది.
ఎందుకిలా?
లక్ష్మి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రవి-లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిసింది. తన కోసం రవి.. కుటుంబాన్ని కూడా వదులుకు వచ్చారన్న అభిమానం, ప్రేమ వంటివి లక్ష్మి మనసులో ముద్రవేసుకున్నాయి. దీంతో చివరి వరకు ఆయనకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్న లక్ష్మి.. కుమార్తెలు, రవి తరఫున సోదరులు ఉన్నప్పటికీ.. ఆమే స్వయంగా సంప్రదాయ రీతిలో భర్తకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు బంధువులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
