తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే కుమారుడి అనుమతి అవసరమా? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. తాత మరణించిన తర్వాత హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆయన ఆస్తి క్లాస్-1 వారసులకు సంక్రమించి, అనంతరం విభజన ద్వారా తండ్రికి ప్రత్యేకంగా వచ్చిన ఆస్తిపై మనవడికి పుట్టుకతోనే హక్కు ఏర్పడదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు ప్రతి రకమైన పూర్వీకుల ఆస్తికి వర్తించదని, ఆస్తి ఎలా సంక్రమించింది, దాని స్వభావం ఏమిటన్నది కీలకమని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జె. రాజేష్ (మైనర్) వర్సెస్ ఎం. కుమారన్ కేసులో ఈ తీర్పు వెలువరించింది. తమిళనాడుకు చెందిన ఈ వివాదం దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. తాతకు చెందిన భూమి ఆయన మరణం తర్వాత వారసుల మధ్య విభజన జరిగింది. ఆ పంపకాల్లో మనవడి తండ్రికి 1,811 చదరపు అడుగుల స్థలం కేటాయించారు. అనంతరం తండ్రి ఆ భూమిని ఇతరులకు విక్రయించారు. అయితే ఆస్తిలో తనకు కూడా సగం వాటా ఉందని, తన అనుమతి లేకుండా తండ్రి విక్రయించడానికి వీల్లేదని వాదిస్తూ కుమారుడు 1997లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ఈ వివాదంలో ప్రధానంగా 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రాధాన్యతను సుప్రీంకోర్టు పరిశీలించింది. హిందూ పురుషుడు వీలునామా రాయకుండా మరణిస్తే, ఆయన ఆస్తి చట్టంలో పేర్కొన్న క్లాస్-1 వారసులకు సంక్రమిస్తుంది. ఇందులో కుమారుడు, కుమార్తె, భార్యతో పాటు ముందే మరణించిన కుమారుడి కుమారుడు వంటి వారసులు ఉంటారు. అయితే జీవించి ఉన్న కుమారుడి కుమారుడు అంటే మనవడు నేరుగా క్లాస్-1 వారసుడిగా పేర్కొనబడలేదు.
సెక్షన్ 8 ప్రకారం తండ్రికి సంక్రమించిన ఆస్తి ఆయన వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందని ధర్మాసనం వివరించింది. తాత ఆస్తి చట్టబద్ధ వారసుల మధ్య విభజన జరిగిన తర్వాత, తండ్రికి కేటాయించిన వాటా ఆయన సొంత ఆస్తిగా మారుతుందని పేర్కొంది. దానిపై తనకు పుట్టుకతోనే సహవారసత్వ హక్కు ఏర్పడిందని మనవడు వాదించలేడని స్పష్టం చేసింది. ఈ సందర్భంలో గతంలో ఇచ్చిన CWT వర్సెస్ చంద్రసేన్ తీర్పును కూడా ప్రస్తావించింది.
తమిళనాడు హిందూ వారసత్వ చట్ట సవరణలోని సెక్షన్ 29-A ఆధారంగా కూడా మనవడి వాదనకు బలం చేకూరదని కోర్టు తెలిపింది. ఆ నిబంధన ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు సహవారసత్వ హక్కులు కల్పించడానికి సంబంధించినదని, ఈ కేసులోని పురుష పిటిషనర్‌కు అది వర్తించదని స్పష్టం చేసింది.
చివరకు మనవడు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును అన్ని పూర్వీకుల ఆస్తులకూ వర్తింపజేయడం సరికాదు. నిజంగా కొనసాగుతున్న ఉమ్మడి కుటుంబ సహవారసత్వ ఆస్తి, సెక్షన్ 8 ద్వారా వ్యక్తిగతంగా సంక్రమించిన ఆస్తి మధ్య చట్టపరమైన తేడా ఉంది. ఆస్తి ఎప్పుడు, ఎవరి నుంచి, ఏ విధంగా సంక్రమించిందన్న అంశాల ఆధారంగానే హక్కులు నిర్ణయించబడతాయి. దీంతో వారసత్వ ఆస్తులపై కొనసాగుతున్న వివాదాల్లో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
