అర్నాబ్ చాట్‌లో హృతిక్-కంగ‌నా

ప్ర‌ముఖ నేష‌న‌ల్‌ జ‌ర్న‌లిస్ట్, రిప‌బ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లీక్డ్ వాట్సాప్ చాట్ కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌లు సంచ‌ల‌న అంశాల‌పై వివిధ వ్య‌క్తుల‌తో అర్నాబ్ చ‌ర్చించిన తీరు విస్మ‌యం గొలుపుతోంది. ఏకంగా 500 పేజీల‌కు పైగా అర్నాబ్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్ బ‌య‌టికి వ‌చ్చింది. పుల్వామా అటాక్స్ స‌హా అనేక అంశాల‌పై అర్నాబ్ జ‌రిపిన సంభాష‌ణ పెద్ద చ‌ర్చ‌కే తావిస్తోంది. కేవ‌లం రాజ‌కీయాల గురించే కాక సినిమా సంబంధిత అంశాల గురించి బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నాబ్ జ‌రిపిన సంభాష‌ణ‌ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అందులో భాగ‌మే.. బాలీవుడ్ హీరో హీరోయిన్లు హృతిక్ రోష‌న్, కంగ‌నా ర‌నౌత్‌ల టాపిక్.

కొంత కాలం హృతిక్, కంగ‌నాల మ‌ధ్య ఎఫైర్ న‌డ‌వ‌గా.. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోవ‌డం, కంగనా త‌ర‌చుగా అత‌డి మీద ఆరోప‌ణ‌లు చేయ‌డం కొన్నేళ్లుగా చూస్తున్న‌దే. ఐతే ఈ వ్య‌వ‌హారం హృతిక్ అమాయ‌కుడ‌ని, కంగ‌నాకు మాన‌సిక వైక‌ల్యం ఉన్న‌ట్లుగా ఉంద‌ని ఈ చాట్‌లో గుప్తా పేర్కొన‌గా.. ఆమెకు ఎరోటో మేనియా ఉంద‌ని అర్నాబ్ వ్యాఖ్యానించాడు. అంటే అర్థ‌మేంట‌ని అడిగితే.. హృతిక్ ప‌ట్ల కంగ‌నాకు శృంగార ప‌ర‌మైన మోజుంద‌ని అర్నాబ్ పేర్కొన్నాడు. కంగ‌నా క‌థ ముగియ‌బోతోంద‌ని గుప్తా అంటే.. ఆమె హ‌ద్దులు దాటిపోయింద‌ని అర్నాబ్ వ్యాఖ్యానించాడు. ఆమెకు పిచ్చెక్కింద‌ని గుప్తా పేర్కొన‌గా.. ఆమె అంటేనే జ‌నం భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్నాబ్ అన్నాడు. జ‌నాలు ఆమెను బ‌హిష్క‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని గుప్తా వ్యాఖ్యానించాడు. నిజానికి అర్నాబ్, కంగ‌నా ఇద్ద‌రూ మోడీ స‌ర్కారుకు అనుకూలురే. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకున్న‌వారే. అలాంటిది అర్నాబ్.. కంగ‌నా గురించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.