జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి మైదానం కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా, స్పిన్‌కు బాగా సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా పరుగుల కోసం ఇబ్బంది పడ్డారు. చివరకు భారత్ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు ఓవర్లలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ తొలి బంతికే ఔటయ్యాడు. సంజూ శాంసన్ 9, ఇషాన్ కిషన్ 3 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 బంతుల్లో 16 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 32 వరకు చేరింది. జపాన్ బౌలర్ చార్లీ హారా, హిన్జే రెండు వికెట్లు తీసుకున్నాడు.
33 పరుగుల లక్ష్యంతో దిగిన జపాన్ కూడా మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ 12 పరుగులు చేయగా, బెంజమిన్ ఇటో డేవిస్ 9 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. వికెట్లు పడుతున్నా జపాన్ మాత్రం మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లింది.
భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ రెండు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి జపాన్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగే వచ్చింది. దీంతో జపాన్ 30 పరుగుల దగ్గర ఆగిపోయింది.
బలమైన భారత జట్టును జపాన్ 32 పరుగులకే పరిమితం చేయడం ఒక ఎత్తయితే, లక్ష్య ఛేదనలో 30 వరకు రావడం మరో ఎత్తు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడినా, జపాన్ మాత్రం టీమిండియాను చివరి బంతి వరకు టెన్షన్‌లో ఉంచింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates