దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే విధంగా నేరాల తీవ్రత ఉంటుంది. చట్టాలంటే భయం లేదు, పోలీసులంటే లెక్కలేదు. సాటి మనుషులంటే అభిమానం, ప్రేమ లేదు. ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొబైల్ ఫోన్ కొనుక్కోని సక్రమంగా ఈఎంఐ కట్టలేదని ఓ యువకుడ్ని కిడ్నాప్ చేయడమే కాకుండా దారుణంగా వేధించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్ లోని నిగోహన్ పరిధిలో గల రాజా రామ్ ఖేడా గ్రామానికి చెందిన నవల్ కుమార్ కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలనుకున్నాడు. అయితే అతడి వద్ద తగినంత డబ్బులు లేకపోవడంతో జీరో పేమెంట్ తో 21,500 ఖరీదు చేసే ఫోన్ కొనుగోలు చేశాడు. నెలకు 2799 రూపాయలు ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి వుంది. కొంతకాలం క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించాడు. ఈ ఏడాదిలో ఒకనెల ఈఎంఐ వాయిదా పడింది. ఒక నెల ఆలస్యం అయితే ఫైన్ విధించడం సహజంగా జరుగుతుంది. కానీ అది లక్నో కదా.
సెప్టెంబర్ 8 వ తేదీన అనికేత్ సింగ్ అలియాస్ కాకా, సుశాంత్ శర్మ స్కూటర్ మీద వచ్చి నవల్ కుమార్ ను కిడ్నాప్ చేసి లక్నో తీసుకెళ్లారు. నగరంలో తెలిసిన బ్లడ్ బ్యాంక్ కు తీసుకెళ్లి బలవంతంగా బ్లడ్ తీసుకున్నారు. దాన్ని విక్రయించారు. అప్పటికైనా వదిలి పెట్టారా అంటే లేదు. అక్కడ నుంచి సదర్ ప్రాంతంలోని ఒక ఇంటికి తీసుకెళ్లి శుభమ్ సింగ్ ఇంట్లో బంధించారు. ఐదు రోజుల పాటు బంధీగా ఉంచారు. సరిగ్గా అన్నం పెట్టకుండా తీవ్రంగా కొట్టారు. ఇంట్లో పనులు చేయించుకున్నారు. అంటే వెట్టి చాకిరీ చేయించారు.
ఆ తర్వాత నవల్ కుమార్ అన్నయ్య రాజ్ కుమార్ కు ఫోన్ చేసి 12 వేల రూపాయలు కట్టి నీ తమ్ముడ్ని విడిపించుకోమ్మని బెదిరించారు. లేకపోతే నీ తమ్ముడ్ని హత్య చేసి గోమతి నదిలో పడేస్తామని హెచ్చరించారు. పోలీసులకు చెబితే ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. నవల్ కుమార్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నవల్ కుమార్ ను రక్షించి వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు. పరారీలో వున్న శుభమ్ సింగ్ ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన లక్నో పోలీస్ హిస్టరీలో డిఫరెంట్ కేసని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates