బిగ్‌ రివీల్‌ పేరుతో రూ.8.5 కోట్ల వసూల్… చివరికి ఏం చూపించాడు?

సోషల్‌ మీడియాలో కొద్ది రోజులుగా హైప్‌ సృష్టించిన ‘ఆగస్టు 25’ బిగ్‌ రివీల్‌ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీగా డబ్బులు వసూలు చేసి.. చివరికి నామమాత్రపు కంటెంట్‌ విడుదల చేశారంటూ పలువురు సోషల్‌ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ‘25 ఆగస్టు 2026’ పేరుతో ఓ సోషల్‌ మీడియా ఖాతాను సృష్టించిన వ్యక్తి.. ఆగస్టు 25న భారీ విషయాన్ని వెల్లడించబోతున్నానంటూ కొద్ది రోజుల పాటు వరుసగా రీల్స్‌ పోస్టు చేసినట్లు సమాచారం. ఈ వీడియోలు పెద్దఎత్తున వైరల్‌ కావడంతో పాటు భారీగా వ్యూస్ వచ్చాయి.

ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ తొలగించే అవకాశం ఉందంటూ.. బిగ్‌ రివీల్‌ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేస్తానని ఓ లింక్‌ షేర్‌ చేశాడు. ఆ లింక్‌ను అనుసరించిన వారిని రూ.500 చెల్లించాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిని నమ్మి సుమారు 1.66 లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించారు. అంటే మొత్తం రూ.8.5 కోట్లు వసూలు చేశారన్నమాట. అయితే ఎంతమంది చెల్లించారు? ఎంత మొత్తం వసూలైంది? అనేది ఇంకా తేలలేదు. 

ఆ తర్వాత ఆగస్టు 25న డబ్బులు చెల్లించిన వారికి హామీ ఇచ్చిన కంటెంట్‌ చేశాడు. అయితే భారీ అంచనాలతో ఎదురుచూసిన ‘బిగ్‌ రివీల్‌’కు బదులుగా మోటివేషనల్‌ వీడియో రావడంతో పలువురు నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బులు చెల్లించిన కొందరు వీడియోలు, పోస్టులు పెట్టి మోసం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.