ఆ కథ అలా ఉంటే హిట్టయ్యేదా?

అల్లరి నరేష్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌కు ‘నాంది’ శుభారంభం పలికినా.. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలందుకోలేరు. రకరకాల జానర్లు ప్రయత్నించిన అతను.. గత ఏడాది ‘12 ఏ రైల్వే కాలనీ’ రూపంలో ఒక థ్రిల్లర్ మూవీ చేశాడు. మా ఊరి పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అనిల్ విశ్వనాథ్ స్క్రిప్టు అందించిన చిత్రమిది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేశాడు.

ఇందులో అల్లరోడి సరసన యువ కథానాయిక కామాక్షి భాస్కర్ల నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. కొన్ని థ్రిల్లింగ్ అంశాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా సినిమా నిరాశపరిచింది. ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కథ మధ్యలో మారిపోవడమే కారణమంటోంది కామాక్షి భాస్కర్ల. ఈ సినిమా మొదట అనుకున్నట్లుగా తెరకెక్కలేదని.. మార్పుల వల్ల సినిమా స్వరూపమే మారిపోయిందని ఆమె చెప్పింది.

ఒక స్టన్నింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా మొదలైనట్లు ఆమె చెప్పింది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. మొదట హీరోయిన్ హత్యకు గురవుతుంది. ఆ హత్య తాలూకు మిస్టరీని హీరో ఛేదించి, చివరికి అతను కూడా చనిపోతాడు. ఐతే మొదట అనుకున్న కథ ప్రకారం ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరూ తర్వాత అన్నాచెల్లెళ్లు అని తేలేలా కథ రాశారట. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన సాయికుమార్.. హీరో చనిపోవడమే మంచిదైంది, లేదంటే తన చెల్లెల్నే ప్రేమించాను అని తెలుసుకుని అతడి గుండె బద్దలైపోయేది అనే డైలాగ్ కూడా చెబుతాడట.

ఐతే మొదట ఇలా ఉన్న స్క్రిప్టులో తర్వాత చాలామంది చేతులు పడడంతో క్యారెక్టర్లు మారిపోయాయని.. ముందు అనుకున్న కథే ఉంటే సినిమా ఫలితం భిన్నంగా ఉండేదేమో అని ఆమె అభిప్రాయపడింది. ఒకవేళ సినిమా హిట్ కాకపోయినా.. ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అయినా కలిగించేదని, మంచి ప్రయోగంగా ఉండేదని ఆమె పేర్కొంది. ఐతే హీరో హీరోయిన్లు అన్నాచెల్లెళ్ళు అని విషయం చివర్లో తెలిస్తే మన ప్రేక్షకులు తట్టుకునేవారా అన్నది ప్రశ్న. వరల్డ్ సినిమాలో ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి. మలయాళంలోనూ దుల్కర్ సల్మాన్ నటించిన ‘సోలో’ సినిమా కథ ఇలాగే ఉంటుంది.