జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. ముఖ్యంగా జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాగా బలహీనపడడంతో ఎవరైనా పెద్ద సినీ స్టార్ రంగంలోకి దిగితే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చనే అభిప్రాయాలు కలిగాయి.
కానీ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా కనీస ప్రభావం చూపలేకపోయారు. ఆ ఖాళీని పూడ్చలేకపోయారు. రజినీ వచ్చినట్లే వచ్చి వెనక్కి తగ్గారు. ఐతే విజయ్ మాత్రం తెలివిగా రాజకీయం చేశారు. తన మీద జనాల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకున్నారు. అన్నీ ఆయనకు కలిసొచ్చి తొలి ప్రయత్నంలోనే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు.
విజయ్ సక్సెస్ చూశాక.. చాలామంది తమిళ స్టార్లలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న డీఎంకే కూడా బలహీన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ధనుష్ ఆల్రెడీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా కొన్ని నెలల ముందు ఫ్యాన్ మీట్ పెట్టి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అభిమానులతో సేవా కార్యక్రమాలు చేయిస్తున్నాడు. ఇలాగే విశాల్ సైతం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు.
ఈ బాటలోనే ఇప్పుడు శివ కార్తికేయన్ రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నట్లు ఇండికేషన్ ఇచ్చాడు. తాజాగా శివ కూడా ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో తన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. తాను పీపుల్ మేడ్ స్టార్ అని, ప్రజల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని వ్యాఖ్యానించాడు. అనేక మంచి విషయాలు చెబుతూ, ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలా తన ప్రసంగం సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలోనే అభిమానులు హాజరయ్యారు. శివకార్తికేయన్ డ్రెస్సింగ్, తన ప్రసంగం అన్నీ కూడా రాజకీయ నాయకుడి తరహాలోనే ఉండడం విశేషం.
శివ సినిమాల్లోకి రావడంతో ధనుష్ పాత్ర కీలకం. హీరోగా తన తొలి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది అతనే. కానీ తర్వాత ఎందుకో తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. శత్రువుల్లా మారిపోయారు. ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలిచ్చిన నేపథ్యంలో అతడికి పోటీగానే శివ ఈ రంగంలోకి వస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. శివ.. విజయ్‌కి అభిమాని అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన పార్టీలో చేరతాడా, లేక సొంత ప్రయాణం చేస్తాడా అన్నది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates