డేవిడ్ వార్నర్… జైలుకెళ్లడం ఖాయమేనా?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో సిడ్నీలో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన కేసులో వార్నర్ తన తప్పును అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడి లాయర్ బాబీ హిల్ స్వయంగా కోర్టుకు తెలియజేశారు. ఏప్రిల్ 5వ తేదీన సిడ్నీలోని ఈస్టర్న్ సబర్బ్స్ ప్రాంతంలో పోలీసులు రొటీన్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఆ సమయంలో వార్నర్ కారును ఆపి బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పరీక్షించగా, రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. చట్టం ప్రకారం అనుమతించిన లిమిట్ కంటే ఇది రెట్టింపు. ఈ కేసు విచారణలో వార్నర్ తరపు న్యాయవాది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

పండుగ రోజున వైన్ తాగడం నేరం కాదని, కానీ క్యాబ్ బుక్ చేసుకోకుండా సొంతంగా కారు నడపాలని వార్నర్ తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా తెలివితక్కువ పనే అని కోర్టులో చెప్పారు. జరిగిన పొరపాటును వార్నర్ పూర్తిగా అంగీకరిస్తున్నాడని స్పష్టం చేశారు. ఈ కేసులో తుది తీర్పు ఆగస్టు 18న రానుంది.

తాగి వాహనం నడిపిన నేరానికి వార్నర్ కు కనీసం ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. దీనికి తోడు 2200 ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ జరిమానాతో పాటు గరిష్టంగా తొమ్మిది నెలల జైలు శిక్ష పడే ప్రమాదం కూడా లేకపోలేదు. తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వార్నర్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2018లో సౌతాఫ్రికా టూర్ లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తేలడంతో ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఆ ఘటనతో కెప్టెన్సీ చేపట్టకుండా జీవితకాల నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. అంతకుముందు 2013లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ పై చేయి చేసుకున్నందుకు కూడా సస్పెన్షన్ కు గురయ్యాడు.