భర్త క్షేమం కోసం తిరుమలలో కాలి నడకన పవన్ భార్య

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం తిరుపతిలోని అలిపిరి నుంచి కాలి బాటన బయలుదేరిన అన్న.. శుక్రవారం రాత్రికే తిరుమల చేరుకున్నారు. అనంతరం శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదికారులు ప్రొటోకాల్ మేరకు ఆమెకు స్వామి వారి దర్శనాన్ని కల్పించారు. 

గతంలోనూ అన్నా కొణిదల శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. నాడు తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్న నేపథ్యంలో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నా… ఆ సందర్భంగా స్వామి వారికి తలనీలాలు కూడా సమర్పించారు. తాజాగా తన భర్త పవన్ కల్యాణ్ కు శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమలలో అన్నాను చూసిన వారంతా… నాడు కుమారుడి క్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల వచ్చిన తాను… ఇప్పుడు తన భర్తకు ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో శ్రీవారి వద్దకు వచ్చారంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనం సందర్భంగా అన్నా సంప్రదాయబద్ధంగా స్వామి వారికి పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో ఆమె వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. అక్కడే టీటీడీ అదికారులు ఆమెకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తన భర్తకు జరిగిన సర్జరీ విజయవంతంగా ముగిసిన నేపథ్యాన్ని తలచుకుని మరీ ఆమె స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. గతంలో తన కుమారుడిని, ఇప్పుడు తన భర్తను స్వామి వారే కాపాడారన్న భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.