ఆరేళ్ల మనుమరాలితో కారు డ్రైవింగ్… ఎస్ఐ సస్పెండ్

చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై పూజారి తిరుపతి వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.

రద్దీగా ఉండే రోడ్డుపై మైనర్ బాలిక చేతికి స్టీరింగ్ అప్పగించి డ్రైవింగ్ చేయించడం, దీనిని ప్రశ్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగడం, అనంతరం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు శాఖ సీరియస్‌గా స్పందించింది. ఎస్సైను సస్పెండ్ చేయడమే కాకుండా శాఖాపర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

స్థానికుల కథనం ప్రకారం, ఎస్సై తన మనవరాలిని డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి ప్రధాన రహదారిపై కారును నడిపించాడు. మైనర్‌కు కారు ఎలా ఇస్తారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించగా, “నేను పోలీస్‌ను… నా మనవరాలికి డ్రైవింగ్ నేర్పిస్తున్నా” అంటూ నిర్లక్ష్యంగా స్పందించినట్లు వీడియోల్లో కనిపించింది. 

ఈ ఘటన కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీసు అధికారే ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.

ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. మైనర్‌కు కారు నడిపేందుకు అనుమతించినందుకు ఎస్సై పూజారి తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్ 125తో పాటు మోటారు వాహనాల చట్టంలోని 184, 180 సెక్షన్ల కింద నర్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి శాఖాపర విచారణ చేపట్టాలని సూచించారు.