కేవలం మూడు వారాలు… ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన సమయం ఇది. జూన్ 12న స్పేస్ ఎక్స్ కంపెనీ నాస్డాక్ మార్కెట్లో అడుగుపెట్టినప్పుడు ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లు కొన్నారు. 135 డాలర్ల వద్ద ఇష్యూ ధర ఉంటే, 150 డాలర్ల వద్ద ఓపెన్ అయి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఒకానొక దశలో కంపెనీ మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరి అమెజాన్ సంస్థనే దాటేసింది. దాంతో మస్క్ వ్యక్తిగత ఆస్తి 1.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగి చరిత్ర సృష్టించింది.
కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జూలై మొదటి వారానికి వచ్చేసరికి స్పేస్ ఎక్స్ షేర్లు టాప్ లెవెల్ నుంచి 30 శాతం మేర పతనమయ్యాయి. ఫలితంగా మస్క్ నెట్ వర్త్ 992 బిలియన్ డాలర్ల మార్కుకు పడిపోయి ట్రిలియనీర్ హోదా చేజారింది. షేర్ మార్కెట్లో ఇంత భారీ పతనం చూసి స్పేస్ ఎక్స్ బిజినెస్ ఏమైనా దెబ్బతిందేమో అనుకుంటే పొరపాటే. కంపెనీ పునాదులు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాయి. సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించేందుకు ‘కర్సర్’ అనే ఏఐ స్టార్టప్‌ను 60 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. కంపెనీ భవిష్యత్తుపై అనలిస్టులు ఇప్పటికీ గట్టి నమ్మకంతోనే ఉన్నారు. అయితే మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇక్కడ సమస్య కంపెనీది కాదు, ఇన్వెస్టర్ల అతి అంచనాలదే. అద్భుతమైన కంపెనీల షేర్లు కూడా కొన్నిసార్లు ఓవర్ వాల్యుయేషన్ వల్ల మార్కెట్లో కరెక్షన్‌కు గురవుతుంటాయి.
స్పేస్ ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది. దీని ద్వారా కంపెనీ ఏకంగా 75 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. మార్కెట్లో ఈ ఐపీఓకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినప్పటికీ, ట్రేడింగ్ కోసం పబ్లిక్‌కు అందుబాటులో ఉంచిన షేర్ల శాతం చాలా తక్కువ. దీనిని మార్కెట్ పరిభాషలో ‘లో ఫ్లోట్’ అంటారు.
అంటే మార్కెట్లో ట్రేడ్ అవ్వడానికి తక్కువ షేర్లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల చిన్నపాటి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినా షేర్ ధరలో ఊహించని భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కంపెనీ వాల్యూ తగ్గకపోయినా, ఈ మార్కెట్ స్ట్రక్చర్ వల్లే షేర్ ధర ఒక్కసారిగా క్రాష్ అయిందని నిపుణులు చెబుతున్నారు. ఎలాన్ మస్క్ సంపదలో మెజారిటీ భాగం స్పేస్ ఎక్స్ షేర్ల రూపంలోనే ఉంది. అందుకే కంపెనీ స్టాక్ పెరిగినప్పుడు ఎంత వేగంగా ఆయన ఆస్తి పెరిగిందో, అంతే వేగంగా ఇప్పుడు కిందకు వచ్చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates