116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సకల మర్యాదలు అందించింది. ఆ భక్తురాలికి తన తనివి తీరేలా స్వామి వారి దర్శనాన్ని కల్పించింది. స్వామి వారి వస్త్రం, ప్రసాదాలతో ఆమెను సత్కరించింది. వెరసి తిరుమలకు వస్తున్న వెంకన్న భక్తుల పట్ల టీటీడీ ఏ రీతిన స్పందిస్తుందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చూపింది. మొత్తంగా వెంకన్న దర్శనం కోసం వచ్చిన ఆ భక్తురాలి చిరకాల కోరికను తీర్చి… భక్తుల సేవలో తానూ తరించిపోయింది.
కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు శనివారం తిరుమల కాలిబాటన కనిపించిన సంగతి తెలిసిందే. మనవలు, మనవరాళ్లతో కలిసి తిరుపతి చేరుకున్న సదరు మహిళ…వారి సాయంతోనే కాలి బాటన తిరుమల చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం అదికారులు… ఆమెను అక్కున చేర్చుకున్నారు. తిరుమల చేరిన ఆ మహిళకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఆ తర్వాత రంగనాయకుల మండపానికి సదరు మహిళను తీసుకెళ్లి ఆమెకు శ్రీవారి వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భద్రంగా ఆమెను ఇంటికి పంపారు. ఈ మొత్తం వీడియోను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తిరుమల కాలి బాటలో కనిపించిన సదరు వృద్ధురాలి పేరు నవనీతమ్మగా తెలిసింది. 116 ఏళ్ల వయసులో స్వామి వారి దర్శనం కోసం కాలి నడకన తిరుమల వస్తున్న నవనీతమ్మ గురించి తెలిసినంతనే బీఆర్ నాయుడు టీటీడీ అదికారులను అప్రమత్తం చేశారు. నవనీతమ్మకు అన్నిరకాలుగా చేదోడుగా నిలుస్తూ… స్వామి వారి దర్శనాన్ని ప్రశాంతంగా కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ నాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన టీటీడీ అదికారులు… నవనీతమ్మ తిరుమల కొండ చేరినంతనే ఆమె దరికి చేరారు. దగ్గరుండి ఆమెకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చేయి పట్టి ఆమెను నడిపించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర దగ్గరుండి మరీ స్వామి వారి దర్శనం చేయించి… రంగనాయకుల మండపంలో ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా తనకు స్వామి వారి దర్శనాన్ని కల్పించిన టీటీడీకి నవనీతమ్మ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. స్వామి వారి దర్వనం కోసం కాలి నడకన వెళ్లాలన్న అమ్మమ్మ కోరిక మేరకే ఆమెను కాలిబాటలో తీసుకెళ్లామని నవనీతమ్మ మనవడు దిక్పతి తెలిపారు. అయితే ఊహించని రీతిలో సీఎం చంద్రబాబు ట్వీట్ వెయ్యడం, టీటీడీ సిబ్బంది తమకు అన్ని రకాలుగా సహకారం అందించడంతో పాటు తమకు స్వామి వారి దర్శనాన్ని వీఐపీ బ్రేక్ దర్శనంలో కల్పించిన తీరు తమను ఆనందాతిశయాలకు గురి చేసిందని తెలిపారు. భక్తుల పట్ల టీడీడీ వ్యవహరిస్తున్న ఈ తరహా తీరుతో తము మంత్రముగ్ధులమయ్యామని ఆయన పేర్కొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
