బుమ్రా.. ఏమిటీ వైపరీత్యం?

బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్ ఎలా అయినా ఉండనీ.. అతను బంతి అందుకుంటే వికెట్ పడాల్సిందే. తన బౌలింగ్ లో పరుగులు చేయాలంటే బ్యాటర్లు ఆపసోపాలు పడాల్సిందే. మిగతా బౌలర్లు తేలిపోతున్న సమయంలో అతను వచ్చి పరుగులు కట్టడి చేసి, వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఎన్నో.

అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా.. బుమ్రా ప్రదర్శన ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని వేరే జట్లకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు కూడా కితాబిచ్చిన బౌలర్ అతను. అలాంటి బౌలర్ వరుసగా ఆరు మ్యాచుల్లో వికెట్ పడగొట్టకపోవడం అన్నది ఊహకి కూడా అందని విషయం. ఐపీఎల్ లో ఈ పేలవమైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు ఈ ముంబయి ఇండియన్స్ బౌలర్. తన కెరీర్లో ఎన్నడూ ఇలా జరిగింది లేదు. బుమ్రా లాంటి బౌలర్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 

ఈసారి ఐపీఎల్ లో ముంబయి 5 మ్యాచులు ఆడి నాలుగు ఓడిపోయింది. అందులో ఒక్క మ్యాచ్ లోనూ బుమ్రా వికెట్ తీయలేదు. గత సీజన్ చివరి మ్యాచ్ లోనూ అతను వికెట్ పడగొట్టకపోవడంతో మొత్తంగా వరుసగా అరడజను ఐపీఎల్ మ్యాచుల్లో అతను వికెట్ తీయనట్లు అయింది.

బ్యాటర్లను ఔట్ చెయ్యకపోవడం ఒక సమస్య అయితే పరుగులు కూడా కట్టడి చెయ్యలేక పోతుండడం ఇంకో సమస్య. బుమ్రా బౌలింగ్ లో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించే బ్యాటర్లు షాట్లకు వెళ్ళరు. కానీ ఈ ఐపీఎల్ లో అలా లేదు. అతడి బంతులను అలవోకగా బాదేస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా ఈసారి బుమ్రా ఎకానమీ 9కి దగ్గరగా ఉంది. గురువారం పంజాబ్ మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 16.3 ఓవర్లలోనే ఛేదించేసింది.

మరో మ్యాచ్ లో బెంగళూరు.. ముంబయి మీద 240 పరుగులు చేసింది. బుమ్రా ఉన్న జట్టు బౌలింగ్ లో ఇంతగా తేలిపోవడం అనూహ్యం. వైభవ్ సూర్యవంశీ లాంటి 15 ఏళ్ల కుర్రాడు.. బుమ్రా బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో ఇంకో బంతికి సిక్స్ కొట్టాడు. దీన్ని బట్టి ఈ ఐపీఎల్ సీజన్లో బుమ్రా బౌలింగ్ ఎంత సాధారణంగా సాగుతోందన్నది అర్థం చేసుకోవచ్చు.