ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే…ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వాహనం ఒకటే… అయితే దానికి ఎప్పుడు పడితే అప్పుడు నెంబర్ మారిపోతుంది.
ఇందుకోసం ఈ మాయగాడు ఏకంగా ఓ కొత్త టెక్నాలజీనే రూపొందించాడు. ఆ టెక్నాలజీతో పోలీసులను మాయ చేస్తూ… వాహనానికి పడిన ఛలాన్లు క్లియర్ చేయకుండా తిరుగుతున్నాడు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు కదా. ఇతడు కూడా అలాగే పట్టుబడిపోయాడు. ఇతగాడు రూపొందించిన ఆ టెక్నాలజీని చూసి ఖాకీకే నోరెళ్లబెట్టేశారట.
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఓ ఖరీదైన కారుతో నగరంలో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తి… రహదారి నిబంధనలను నిత్యం అతిక్రమిస్తూ తిరుగుతున్నాడట. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన సమయాల్లో పోలీసులు ఆ వాహనానికి జరిమానా విధిస్తూ ఛలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఛలాన్లకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండానే అతగాడు యథేచ్ఛగా తిరుగుతున్నాడట. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతగాడు శనివారం రాత్రి పట్టుబడ్డాడట.
ఈ సందర్భంగా అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులోని నయా టెక్నాలజీని చూసి అవాక్కయ్యారట. ఆ టెక్నాలజీ ఏంటంటే… సదరు వాహనం నెంబరును ఎప్పటికప్పుడు మార్చేసేందుకు ఆ వ్యక్తి సదరు టెక్నాలజీని రూపొందించాడట. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలుమార్లు వినియోగించిన సదరు వ్యక్తి తన కారుపై ఉన్న లెక్కలేనన్ని ఛలాన్ల జరిమానాను చెల్లించకుండానే తిరుగుతున్నాడు.
ఇందుకు అతగాడు కారు నెంబర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు మార్చాడట. అతడు వినియోగించిన టెక్నాలజీలో ఓ బటన్ నొక్కితే కారు నెంబర్ ఇట్టే మారిపోతుందట. ఇలా పోలీసులు కనిపించినప్పుడల్లా తన కారు నెంబరును మార్చేసుకుని వారి నుంచి తప్పించుకుని అతగాడు తిరుగుతున్నాడట.
Gulte Telugu Telugu Political and Movie News Updates