పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల సీఐగా పనిచేస్తున్న వెంకటరమణ ఓ కీలకమైన కేసులో నిందితులకు సహకరించి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన మరువకముందే… అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావు మరో కేసులో పట్టుబడిపోయారు.
ఏకాంతంగా గడిపే జంటలను టార్గెట్ చేసిన ఆయన వారి వీడియోలు తీసి… బెదిరింపులకు దిగారు. బాధితులతో డబ్బు దండుకోవడంతో పాటుగా తన కోరికలు తీర్చాలంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ణ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పల్నాడు జిల్లా ప్రత్యేకించి మాచర్ల పరిసరాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలను టార్గెట్ చేసిన శ్రీనివాసరావు… ఓ ఆటో డ్రైవర్ సాయంతో దురాగతానికి పాల్పడ్డారు. జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి వీడియోలను చిత్రీకరించే శ్రీనివాసరావు.,. ఆ తర్వాత వాటిని సదరు జంటలకు చూపించి వారి వద్ద డబ్బు డిమాండ్ చేసేవారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే… వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించేవారు. ఈ బెదిరింపులకు భయపడే జంటలు ఆయన అడిగినంత డబ్బు సమర్పించుకునేవారు.
అయితే డబ్బు దండుకోవడంతోనే సరిపెట్టని శ్రీనివాసరావు… తన కోరిక తీర్చాలంటూ ఆ జంటల్లోని మహిళలను వేదించేవారు. తన కోరికను తీర్చకుంటే.. వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించేవారు. దీంతో చాలా మంది ఆయనకు లొంగిపోయారన్న వాదన వినిపిస్తోంది.
ఇలా వందలాది జంటలపై శ్రీనివాసరావు వేధింపులకు పాల్పడ్డట్టుగా సమాచారం. ఈ విషయం ఎలాగోలా పోలీసు ఉన్నతాధికారులకు చేరగా… వారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఐజీ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటికి మొన్న ఓ పరువు హత్య కేసులో యువతిని చంపిన ఓ తండ్రికి సహకరించారంటూ మాచర్ల సీఐ వెంకటరమణపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా… అది నిజమేనని తేలింది. ఈ ఘటన మరువకముందే శ్రీనివాసరావు దురాగతం బయటపడటం గమనార్హం.
శ్రీనివాసరావు మాదిరిగానే… మాచర్ల పీఎస్ లో పనిచేస్తున్న ఓ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా జంటల వీడియోలు తీస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. మొత్తంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న మాచర్లలో శాంతిభద్రతల పరిరక్షణను వదిలేసిన అక్కడి పోలీసులు ఈ తరహా వ్యవహారాల్లో నిమగ్నమైన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates