ఈ ‘మగ’ బుద్ధికి కన్న బిడ్డలు బలి

సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా… లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి… ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన నిలువెత్తు సాక్ష్యం. తనకు పుట్టిన ఇద్దరూ ఆడ పిల్లలే అన్న భావన ఆ తండ్రిలోని మగ బుద్ధిని తట్టి లేపగా… పూర్తి విచక్షణ కోల్పోయి.. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తన ఇద్దరు బిడ్డల నోట్లో విషం పోశాడు. అప్పటికీ చల్లారని ఆ మగ బుద్ధి ఆ పిల్లలను బావిలో పడేసింది. వెరసి ఆ ఇద్దరు పసిపిల్లలను ఆ మగ బుద్ధి చంపేసింది. 

సభ్య సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే…కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ కు చెందిన కచ్చు శ్రీశైలం…మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికను ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా… వారికి నాలుగేళ్ల క్రితం గీతాన్ శ్రీ, గీతాన్విక (4) కవల పిల్లలు జన్మించారు. వీరు పుట్టేదాకా బాగానే ఉన్న శ్రీశైలం… తనకు పుట్టిన ఇద్దరు పిల్లలూ ఆడపిల్లలేనని, మగ పిల్లలు లేరంటూ భార్యతో నిత్యం గొడవ పడేవాడట.

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డ శ్రీశైలం…భార్య బయటకు వెళ్లగానే ఇద్దరు కుమార్తెలను బయటకు తీసుకెళ్లిన శ్రీశైలం వారికి గడ్డి మందు తాగించాడట. అప్పటికీ తనలోని మగ బుద్ధి చల్లారక… గడ్డి మందు కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆ చిన్నారులను వ్యవసాయ బావిలోకి విసిరేశాడట. తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల ఉసురు తీశానన్న బాధ ఏమాత్రం లేని శ్రీశైలం.. పిల్లలేరని అడిగిన భార్యకు వారిని బావిలో పడేశానని చెప్పాడట. 

9 నెలలు కడుపున మోసి కని పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరన్న విషయం తెలిసినంతనే మౌనిక హతాశురాలై ఇరుగుపొరుగు వారితో హుటాహుటీన బావి వద్దకు వెళ్లింది. బావిలో వెతతగా గీతాన్ శ్రీ శవం లభించింది. ఆ తర్వాత గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా… గీతాన్విక మృతదేహం లభించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు విగత జీవులనుగా చూసిన గ్రామస్తులు శ్రీశైలంకు బడితె పూజ చేశారు. సమయానికి పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తుల బారి నుంచి ఆ మగ బుద్ధిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.