అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఎర్ర సముద్రం (Red Sea) అడుగున ఉన్న కీలకమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ ఈ కేబుల్స్ కట్ అయితే, అంతర్జాతీయంగా డేటా రవాణా నిలిచిపోయి ఇంటర్నెట్ సేవలు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇప్పటికే ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఈ కేబుల్స్‌ను తెంచేస్తామని పలుమార్లు హెచ్చరించడం ఈ భయాలను నిజం చేస్తోంది. నిజానికి మనం వాడుతున్న ఇంటర్నెట్ లో 95 శాతం డేటా సముద్రం అడుగున ఉండే ఈ భారీ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఎర్ర సముద్రం అనేది ఆసియా, ఐరోపా దేశాలను కలిపే అతి ముఖ్యమైన ఇంటర్నెట్ రహదారి. గతంలో 2025 సెప్టెంబరులో ఒక నౌక లంగరు తగిలి ఈ కేబుల్స్ తెగిపోవడంతో చాలా దేశాల్లో ఇంటర్నెట్ నెమ్మదించింది. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల ఎవరైనా కావాలని ఈ కేబుల్స్‌ను ధ్వంసం చేస్తే, ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్ వంటి డిజిటల్ సేవలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి భారత్‌కు కూడా పెద్ద చిక్కే తెచ్చిపెట్టవచ్చు. మన దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ముంబై, చెన్నై, కొచ్చిన్ వంటి నగరాల్లో 17 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనం చేసే ప్రతి డిజిటల్ పేమెంట్, పంపే ప్రతి ఈమెయిల్ ఈ సముద్రపు కేబుల్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రెడ్ సీలో కేబుల్స్ కట్ అయితే, మన దేశంలో ఇంటర్నెట్ వేగం పడిపోవడమే కాకుండా, నెట్వర్క్ లోడ్ పెరిగి చాలా వెబ్‌సైట్లు పనిచేయవు. ఇది మన ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
భారతదేశ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు మూడింట రెండు వంతులు ముంబై ల్యాండింగ్ స్టేషన్ ద్వారానే వెళ్తుంది. అంటే మన దేశ ఇంటర్నెట్ వ్యవస్థ అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి సమయంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా లేదా సముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నా దేశం మొత్తం ఇంటర్నెట్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం చమురు ధరలనే కాకుండా, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఇంటర్నెట్‌ను కూడా భయపెడుతోంది. ప్రస్తుతానికి ఇరాన్ నేరుగా కేబుల్స్ కట్ చేస్తామని ప్రకటించకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న హెచ్చరికలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
