విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్‌వీ నగర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్రకు ఇప్పటికే వివాహం కాగా, మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇటీవల డబ్బుల వ్యవహారంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
ఆదివారం రాత్రి భార్య పుట్టింటికి వెళ్లిన అవకాశాన్ని వినియోగించుకుని మౌనికను తన ఫ్లాట్‌కు పిలిచిన రవీంద్ర, అక్కడ జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, మిగిలిన భాగాలను మూట కట్టి ఇంట్లోనే దాచినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మౌనిక తల భాగం కనిపించకపోవడంతో పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణం నగరంలో భయాందోళనలకు దారితీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates