శ్రీశ్రీ… ఇది కదా కావాల్సింది

సినిమాని ఎంత బాగా తీశామో దానికి అంతే మంచి టైటిల్ పెట్టడం ఎంతో అవసరం. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన చాలా మంది దర్శకులు అర్థం కానీ గ్రాంథికంలో పేర్లు ఎంచుకోవడం, లేదా మాస్ జనాలకు అర్థం కాని ఇంగ్లీష్ పదాలను పెట్టుకోవడం చూస్తుంటాం. దుల్కర్ సల్మాన్ ఈ విషయంలో అదృష్టవంతుడు. మహానటి లాంటి స్ట్రెయిట్ మూవీతో మొదలుపెట్టి కనులు కనులు దోచాయంటే లాంటి డబ్బింగ్ చిత్రం దాకా అధిక శాతం తెలుగుతనం తొంగి చూస్తుంది.

నిర్మాణంలో ఉన్న ఆకాశంలో ఒక తార అదే కోవలోకి రాగా తాజాగా తన మరో కొత్త సినిమాకు ఇంకో బ్యూటిఫుల్ టైటిల్ దొరికింది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమాకు ‘శ్రీ శ్రీ’ పేరు ఫిక్స్ చేస్తూ నిర్మాణ సంస్థ అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఒక అందమైన ప్రేమ జంట గోడ మీద ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్న సింపుల్ స్టిల్ తో ఆకట్టుకునేలా చేసింది. రవి నెలకుడితి దర్శకత్వం వహించిన శ్రీశ్రీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

విడుదల తేదీ అందులో పేర్కొనలేదు కానీ 2026 అంటే ఈ ఏడాదే ఉంటుందనే సంకేతం అయితే ఇచ్చారు. ఆగస్ట్ లో దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ వస్తోంది. అంటే శ్రీశ్రీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే సాహితి ప్రపంచంలో ఆయన ఎంత లబ్దప్రతిష్టులో తెలిసిందే. ఒక కొత్త శకాన్ని, చదువరుల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మహా ప్రస్థానం వాటిలో మైలురాయి.

అయితే ఆ శ్రీశ్రీకి మన దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీకి కనెక్షన్ ఉందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇన్ సైడ్ టాక్ ప్రకారం హీరో హీరోయిన్ల పేర్లని ఇలా పొయెటిక్ గా పెట్టారన్న మాట. దుల్కర్ పేరు శ్రీనివాస్ కాగా పూజా హెగ్డేకు శ్రీ అనే పేరు ఉంటుంది. రెండింటి మొదటి అక్షరాలు కలిపితే శ్రీశ్రీ అవుతుంది. చాలా కాలం తర్వాత పూజా హెగ్డే ఒక ఫీల్ గుడ్ మూవీ చేస్తుండగా దుల్కర్ కూడా ఈ ప్రాజెక్టు మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అదే నిజమైతే ఇంకో హిట్టు పడ్డట్టే.