వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల జరిమానా విధించడమే కాకుండా, సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 50 లక్షల భారీ పెనాల్టీ వేసింది.
రితేష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడు మార్చి 15న ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు వడ్డించిన భోజనంలో పురుగులను గుర్తించారు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో పెరుగు గిన్నెలో పురుగులు కదులుతున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. అక్కడే ఉన్న ట్రైన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్న దృశ్యాలను కూడా వీడియో తీశారు. ఇతర ప్రయాణికులు కూడా అక్కడికి చేరుకుని అధికారులను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో చర్చకు దారితీయడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని స్పష్టం చేసింది. నాసిరకం భోజనాన్ని అందించిన సదరు సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. భారీ జరిమానాలు విధించడం ద్వారా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠిన సంకేతాలను పంపింది.
వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చోట కూడా ఇలాంటి అశుభ్రమైన ఆహారం వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీ సమయంలో కూడా పురుగులు స్పష్టంగా కనిపిస్తుండటంతో కేటరింగ్ విభాగానికి బాధ్యత లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దీంతో అతన్ని అందరూ అపరిచితుడు సినిమాలోని రామానుజం పాత్రతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి సంధర్భాల్లో మనకెందుకులే అని వదిలేసే ఈరోజుల్లో ఇంత పట్టుతో రైల్వే శాఖను కదిలించాడని మెచ్చుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates