ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వెంటనే అధికారులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.