టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వికెట్ల వెనుక నుంచి బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా బౌలర్లు క్రీజు లోపలి నుంచే బౌలింగ్ చేయడం చూస్తుంటాం, కానీ ఎరాస్మస్ ఏకంగా అంపైర్ వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని వదలడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది కరెక్టేనా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఐసీసీ రూల్స్ ప్రకారం, ఒక బౌలర్ పాపింగ్ క్రీజ్ (క్రీజు గీత) వెనుక నుంచి ఎక్కడి నుంచైనా బౌలింగ్ చేయవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. బౌలర్ బంతిని వదిలేటప్పుడు అంపైర్ దృష్టికి ఆటంకం కలగకూడదు. ఒకవేళ బౌలర్ అంపైర్ వెనుక నుంచి రావడం వల్ల, అంపైర్ ఆ బంతిని సరిగ్గా చూడలేకపోతే దానిని ‘డెడ్ బాల్’గా ప్రకటించే అధికారం అంపైర్‌కు ఉంటుంది. నమీబియా మ్యాచ్‌లో కూడా ఒకసారి అంపైర్ రాడ్ టక్కర్ అదే కారణంతో డెడ్ బాల్ ఇచ్చారు.
ఎరాస్మస్ ఇలాంటి వింత బౌలింగ్‌తో భారత బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తిలక్ వర్మను అవుట్ చేసిన సమయంలో అతను క్రీజుకు చాలా వెనుక నుంచి బంతిని వదిలి వికెట్ సాధించాడు. అంపైర్ ముందుగానే ఈ యాక్షన్ గురించి తెలిసుంటే దానిని ఫెయిర్ బాల్‌గానే పరిగణిస్తారు.
ఇక ఈ మ్యాచ్ లో కూడా ముందుగానే ఒకసారి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి కాబట్టి అది ఫెయిర్ డెలివరీ అయ్యింది. ఏదేమైనా ఈ తరహా బౌలింగ్ వెనుక ఒక వ్యూహం కూడా ఉంది. బౌండరీలు చిన్నగా ఉన్నప్పుడు లేదా బ్యాటర్లు సెట్ అయినప్పుడు, వారి రిథమ్‌ను దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు.
ఎరాస్మస్ తన సైడ్ ఆర్మ్ వేరియేషన్లతో టీమిండియాను కట్టడి చేయడమే కాకుండా, వికెట్ల వెనుక నుంచి బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను అయోమయంలో పడేశారు. ఈ మ్యాచ్‌లో అతను తీసిన 4 వికెట్లు చూస్తుంటే, ఈ ‘వింత’ వ్యూహం కొంతవరకు ఫలించిందనే చెప్పాలి. అయితే ఎరాస్మస్ ప్రదర్శన భారత్‌కు రాబోయే పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక హెచ్చరికలాంటిదని చెప్పవచ్చు.
పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా ఇలాంటి అసాధారణ బౌలింగ్ యాక్షన్ తో మధ్యలో ఆగడం వంటి పద్ధతులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. తారిక్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు వద్ద రెండు మూడు సెకన్ల పాటు ఆగడం బ్యాటర్ టైమింగ్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి, నమీబియా కెప్టెన్ చేసిన ఈ ప్రయోగాలు పాక్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడానికి టీమిండియాకు ఒక చిన్నపాటి రిహార్సల్‌లా పనికొస్తాయని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates