ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 28 నుంచి ఈ సరికొత్త సేవలు ప్రారంభం కానున్నాయి. యూఐడీఏఐ డే వేడుకల సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ కొత్త విధానం వల్ల ఫిజికల్ సెంటర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలు, ఇతర గుర్తింపు సేవలను సులభంగా పొందేందుకు ఈ సౌకర్యం ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, వృద్ధులకు ఇది గొప్ప వెసులుబాటు అని చెప్పవచ్చు.
దేశంలోని డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ సేవలు, సబ్సిడీలు, ప్రభుత్వ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ మరింత సరళతరం కానుంది. దీనివల్ల డిజిటల్ సేవలు ప్రతి పౌరుడికి చేరువవుతాయని యూఐడీఏఐ భావిస్తోంది.
ఈ కొత్త సేవలను పొందడంలో ఆధార్ మొబైల్ అప్లికేషన్ కీలక పాత్ర పోషించనుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ అధికారిక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్యంత భద్రతతో కూడిన ఈ యాప్ ద్వారా యూజర్లు తమ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సామాన్యులకు సైతం అర్థమయ్యేలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ సేవలను డిజైన్ చేశారు. ఈ కొత్త సదుపాయం ద్వారా కోట్లాది మంది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరనుంది. మీ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ అయి ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates