ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం ప్రియుల్లో బడాబాబులు కూడా ఎంతో మంది ఉన్నారు. మందుబాబులు తీసుకునే లిక్కర్ వందల్లో ఉంటే, బడాబాబులు తాగే మద్యం ఖరీదు వేలల్లో ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ కనీస ధర 20,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక లక్షల వరకు కూడా మద్యం ధర పలుకుతోంది.

అయితే ఎవరి స్థాయి వారిది. ఎవరి స్థాయిని బట్టి వారు మద్యం కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడే కల్తీ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏపీలో చిన్నపాటి మద్యం కల్తీ వ్యవహారమే కలకలం రేపింది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఖరీదైన మద్యంలోనూ కల్తీ ముఠా కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

పోనీ బాటిల్ లో ఏమైనా తేడా ఉంటుందా అంటే, దాన్ని గుర్తించడం దానిని మార్చిన వాడికే సాధ్యం కావడం లేదు. అంత పక్కాగా ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు.

తాజాగా 20,000 రూపాయల ఖరీదైన మద్యం బాటిళ్ల కల్తీ ముఠాను హైదరాబాద్ కు చెందిన ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా తీగ లాగితే ఒడిశా వరకు నకిలీ ముఠా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌకైన మద్యాన్ని కలిపేసి 10,000 రూపాయలకు విక్రయిస్తున్నారు.

అదేమంటే స్మగుల్డ్ బాటిల్స్ అంటూ కలరింగ్ ఇస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.

ఈ కల్తీ ముఠా గచ్చిబౌలి కేంద్రంగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే కల్తీ ప్రక్రియ మాత్రం ఒడిశాలో జరుగుతోంది. అక్కడి నుంచి రవాణా అయి హైదరాబాద్ లోని బడాబాబుల ఇళ్లకు చేరుతోంది.

కాబట్టి ఖరీదైందే కదా అని నమ్మి తాగేస్తే నకిలీ మద్యం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఏం చేయాలి?

ఈ నేపథ్యంలో కల్తీ ముఠా బారిన పడకుండా నిర్దేశిత ఔట్ లెట్ల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే స్కానింగ్ చేసి పరిశీలించాలని చెబుతున్నారు. అయినా ఖరీదైన మద్యం నిజమైనదే అన్న పూర్తి సంతృప్తి దక్కుతుందా అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.