క్రికెటర్‌గా, క్రికెట్ పాలకుడిగా సౌరభ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర. భారత క్రికెట్ సంక్షోభంలో ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కళంకితుడైన అజహరుద్దీన్ స్థానంలో టీమ్ ఇండియా పగ్గాలందుకుని తిరుగులేని స్థాయికి చేర్చిన ఘనత అతడిదే. ఇక ఆట నుంచి నిష్క్రమించాక తక్కువ సమయంలోనే బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా గత ఏడాది బీసీసీఐ పగ్గాలు కూడా అందుకున్నాడు.
ఇంత తక్కువ సమయంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐకి అధ్యక్షుడు కావడం అసామాన్యమైన విషయం. ఆ పదవిలో తనదైన శైలిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ దేశంలో క్రికెట్ పాలనను గాడిలో పెడుతున్నాడు. ఈ ఏడాది కష్టమే అనుకున్న ఐపీఎల్‌ను యూఏఈకి తీసుకెళ్లి విజయవంతంగా నిర్వహించడంలో గంగూలీ పాత్ర కీలకం.
ఐతే ఈ సానుకూలతలన్నీ పక్కన పెడితే.. గంగూలీ చేస్తున్న ఓ పని మాత్రం జనాలకు నచ్చట్లేదు. అతను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూ ప్రకటనల్లో నటిస్తున్నాడు. అది కూడా గ్యాంబ్లింగ్‌కు దగ్గరగా ఉంటే ఫాంటసీ లీగ్‌ను నడిపించే మై ఎలెవన్ సర్కిల్‌కు ప్రచారం చేస్తున్నాడు. ఓవైపు డ్రీమ్ ఎలెవన్ సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా.. దానికి పోటీదారు అయిన మై ఎలెవన్ సర్కిల్‌కు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందన్న వాదనలున్నాయి.
బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉంటూ అసలు ప్రకటనల్లో నటించడమే సరికాదన్న అభిప్రాయం ఉండగా.. గంగూలీ ఏమో ఏకంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు దగ్గరగా ఉండే ఫాంటసీ లీగ్‌ను నడిపించే సంస్థకు ప్రచారం చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఐతే గంగూలీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates