కన్నవారే కసాయిలా మారి తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఒక చోట తల్లి పిల్లలకు విషం పెట్టి తనూ ప్రాణాలు తీసుకుంటే, మరోచోట తండ్రి పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా మానవత్వం ఎక్కడ మాయమైందనే ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకు వస్తుంది.
పసిప్రాణాల భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఎవరు ఇచ్చారు? జీవితం కంటే తమ బాధలే పెద్దవిగా భావించి, చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ చర్యలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
కొత్త సంవత్సరం వేళ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రెండు ఘటనలు ఈ విషాదానికి నిదర్శనంగా నిలిచాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో భర్త మృతితో తీవ్ర మానసిక వేదనలో ఉన్న ఓ తల్లి, అన్నంలో పురుగుల మందు కలిపి తన ఇద్దరు పిల్లలకు తినిపించి తానూ ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కుమార్తె మృతి చెందగా, కుమారుడు విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరో ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో జరిగింది. భార్య మృతితో కుంగిపోయిన ఓ తండ్రి, తన ముగ్గురు చిన్నారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి, వారు చనిపోయిన తర్వాత తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పదేళ్ల లోపు ఉన్న ఆ ముగ్గురు పసికందులు తమ తల్లిదండ్రుల బాధలకు బలయ్యారు.
ఇలాంటి ఘటనలను మానసిక వైజ్ఞానికంగా ‘అల్ట్రూస్టిక్ ఫిలిసైడ్’గా పేర్కొంటారు. భవిష్యత్తులో పిల్లలు కష్టపడతారనే భ్రమలో, వారిని ‘రక్షించాలి’ అన్న తప్పుడు ఆలోచనతో తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలకు వస్తారని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్, సైకోసిస్, బైపోలార్ డిసార్డర్ వంటి మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ కలహాలు, ఒంటరితనం, వ్యసనాలు ఈ దారుణాలకు దారి తీస్తున్నాయి.
అయితే ఏ పరిస్థితిలోనూ పిల్లల ప్రాణాలు తీసుకోవడం సమర్థనీయం కాదని, మానసిక సమస్యలపై అవగాహన పెంచి, అవసరమైనప్పుడు సహాయం తీసుకునే వ్యవస్థ బలపడితే ఇలాంటి విషాదాలను అడ్డుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates