న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ పేరుతో లింకులు… ఓపెన్ చేశారా అంతే!

People with warning notification and spam message icon on mobile phone

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు పంపించుకుంటున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమ మోసాలకు వాడుకుంటున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, గిఫ్ట్, ప్రత్యేక ఆఫర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపిస్తూ అమాయకులను మభ్యపెడుతున్నారు.

ముఖ్యంగా గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే ఫోన్‌లో హానికరమైన మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి, మొబైల్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

ఫోన్ హ్యాక్ అయిన తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీలు, యూపీఐ సమాచారం, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫోటోలు, కాంటాక్ట్స్ వంటి కీలక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు, బాధితుడి ఫోన్ నుంచే అతని స్నేహితులు, బంధువులకు కూడా అదే లింకులు వెళ్లేలా మాల్వేర్ పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

దీంతో ఒక్కరి నిర్లక్ష్యం వల్ల అనేక మంది ఆర్థిక నష్టం చవిచూసే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవల ఇలాంటి మోసాల వల్ల పలువురు బాధితులు తమ ఖాతాల నుంచి డబ్బులు కోల్పోయిన ఘటనలు నమోదైనట్లు సమాచారం.

ఈ తరహా సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీసీపీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, ఫైల్స్‌ను ఓపెన్ చేయకూడదని, అధికారిక యాప్ స్టోర్‌ల ద్వారా కాకుండా వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని తెలిపారు.

ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చినా, అనూహ్య లావాదేవీలు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని, ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు.