ఎడారి దేశంలో మంచు… మనకి గండమా?

సౌదీ అరేబియా ఎడారిలో మంచు కురవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ వింటర్ లో ఉత్తర ప్రాంతంలోని తబూక్ లో కొండలన్నీ మంచుతో నిండిపోయి వైట్ గా మారిపోయాయి. ఇది చూడటానికి అద్భుతంగా ఉన్నా, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినా.. దీని వెనుక ఒక పెద్ద ప్రమాద హెచ్చరిక దాగి ఉంది. భూమి వాతావరణ వ్యవస్థలో మౌలిక మార్పులు వస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం.

క్లైమేట్ చేంజ్ అంటే కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాతావరణం వేడెక్కే కొద్దీ, గాలిలో తేమ, ఎనర్జీ పెరిగి వెదర్ ప్యాట్రన్స్ అన్నీ తలకిందులు అవుతాయి. అందుకే ఎడారిలో మంచు కురుస్తోంది, చల్లని ప్రదేశాల్లో వేడి పెరుగుతోంది. ఇది ఇండియాకు కూడా ఒక సీరియస్ వార్నింగ్ బెల్ లాంటిదనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాది మనం ఇండియాలో ఎన్నో విపరీతమైన పరిస్థితులను చూసాం. ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు మండిపోతే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలలో క్లౌడ్ బరస్ట్స్ వల్ల వరదలు ముంచెత్తాయి. ఋతుపవనాలు కూడా దారి తప్పాయి. ఇవేవీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు, క్లైమేట్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పడానికి ఇవే ఉదాహరణలు.

సౌదీలో మంచు కురవడాన్ని ఏదో వింతగా చూడకూడదనే హెచ్చరికలు వస్తున్నాయి. మన వ్యవసాయం, వాటర్ మేనేజ్మెంట్, సిటీ ప్లానింగ్ అన్నీ కాలానికి అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు ఆ టైమ్ టేబుల్ మారిపోతే రైతుల నుంచి సిటీ జనాల వరకు అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మనం వరదలను తట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేడిని తట్టుకునే సిటీ ప్లానింగ్ పై దృష్టి పెట్టకపోతే మున్ముందు ఇంకా గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.