నింగిలోకి ‘బాహుబలి’… అంతరిక్షం నుంచే ఇంటర్నెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మోసుకెళ్లిన ‘బ్లూబర్డ్ 6’ అనే అమెరికన్ శాటిలైట్ ఇప్పటివరకు భారత గడ్డ పైనుంచి లాంచ్ చేసిన అత్యంత బరువైన పేలోడ్ కావడం విశేషం. ఉదయం 8:55 గంటలకు ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది.

ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతరిక్షం నుంచే నేరుగా మన స్మార్ట్‌ఫోన్లకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందించడమే దీని లక్ష్యం. దీనికోసం ఎలాంటి స్పెషల్ పరికరాలు అవసరం లేదు. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థ తయారు చేసిన ఈ నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా సెల్యులార్ నెట్‌వర్క్ లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.

అయితే ఈ లాంచ్ చివరి నిమిషంలో ఒక 90 సెకన్ల పాటు ఆలస్యం అయ్యింది. రాకెట్ వెళ్ళే దారిలో వేరే శాటిలైట్ శకలాలు లేదా డెబ్రిస్ అడ్డు వచ్చే ఛాన్స్ ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ముందు అనుకున్న 8:54 కాకుండా, సేఫ్టీ కోసం 8 గంటల 55 నిమిషాల 30 సెకన్లకు టైమ్ మార్చారు. శ్రీహరికోట పైన ఆకాశం శాటిలైట్లతో నిండిపోవడం వల్లే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

ఈ విజయంపై ఇస్రో ఉన్నతాధికారి డాక్టర్ వి. నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది గ్లోబల్ మార్కెట్లో భారత్ సత్తాను చాటిచెప్పే ప్రయోగం అని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఇది భారత అంతరిక్ష రంగానికి గర్వకారణం అని ట్వీట్ చేశారు. వాణిజ్యపరంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL చేపట్టిన ఈ మిషన్, హెవీ లిఫ్ట్ సామర్థ్యంలో భారత్ స్థానాన్ని పదిలం చేసింది.

ఇస్రో అభివృద్ధి చేసిన ఈ బాహుబలి రాకెట్ సామర్థ్యం మామూలుది కాదు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 వంటి చారిత్రక మిషన్లను మోసుకెళ్లింది ఇదే. 640 టన్నుల బరువు, 43.5 మీటర్ల ఎత్తు ఉండే ఈ రాకెట్, 4,200 కిలోల బరువును సునాయాసంగా కక్ష్యలో ప్రవేశపెట్టగలదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎల్వీఎం3 ఇప్పుడు గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్లో నమ్మదగిన వాహక నౌకగా మారింది.