టీమిండియాకు అసలు గండం వాళ్లతోనే

వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గురించే హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్ లో లేదు, ‘సూపర్ 8’లో ఉంది. ఐసీసీ ఈసారి అమలు చేస్తున్న ‘ప్రీ డిసైడెడ్ సీడింగ్స్’ వల్ల ఇండియాకు ముందే రూట్ మ్యాప్ ఫిక్స్ అయిపోయింది. గ్రూప్ స్టేజ్ లో మనవాళ్ళు ఎన్ని మ్యాచులు గెలిచినా, ఓడినా.. తర్వాతి రౌండ్ కు జస్ట్ క్వాలిఫై అయితే మాత్రం ‘A1’ సీడింగ్ తోనే వెళ్తారు. ఇది ప్రేక్షకుల ఆసక్తిని, టికెట్ల సేల్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్లాన్ లా కనిపిస్తోంది.

ఈ సీడింగ్ వల్ల సూపర్ 8లో ఇండియా పడబోయే గ్రూప్ ఏమీ అంత ఈజీగా లేదు. అక్కడ మనతో తలపడబోయేది ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా. ఈ మూడు జట్లు టి20 ఫార్మాట్ లో ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ‘డెత్ గ్రూప్’ అని పిలవచ్చు. సెమీస్ చేరాలంటే SKY సేన ఈ మూడు పెద్ద జట్లను దాటాల్సిందే. పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఈ మూడు మ్యాచ్‌లే వరల్డ్ కప్ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి.

ఇక్కడ టీమిండియాకు కలిసొచ్చే అంశం ‘వేదికల ఎంపిక’. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ను స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ మీద షెడ్యూల్ చేయడం ఒక మాస్టర్ ప్లాన్. కంగారూలను స్పిన్ ఉచ్చులో బిగించాలనేది ఇక్కడ వ్యూహం. ఇక బౌన్సీ పిచ్ ఉండే అహ్మదాబాద్ లో సౌతాఫ్రికాతో, బ్యాటింగ్ కు స్వర్గధామం అయిన కోల్ కతాలో వెస్టిండీస్ తో మ్యాచ్ లు ఉంటాయి. ప్రత్యర్థి బలహీనతలను బట్టే గ్రౌండ్స్ ఫిక్స్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

పిచ్ లను బట్టి మన తుది జట్టు కూర్పులో కూడా మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. స్పిన్ ట్రాక్ అయితే కుల్దీప్ యాదవ్, బౌన్స్ ఉంటే హర్షిత్ రానా లేదా అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తారు. అంటే ఒకే ఫిక్స్డ్ టీమ్ కాకుండా.. ఒక పద్ధతిలో కండిషన్స్ కు తగ్గట్టు ప్లేయర్స్ ను మారుస్తారు. ఇలా ప్రతి మ్యాచ్ కి ఒక స్పెషల్ స్ట్రాటజీతో ఇండియా బరిలోకి దిగబోతోంది.

గ్రూప్ దశలో యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లు ఉన్నా, టీమిండియాకు అసలు సిసలైన పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి మొదలయ్యే సూపర్ 8లోనే ఉంటుంది. అక్కడ గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. కప్పు కొట్టాలంటే ముందు ఈ సూపర్ 8 గండాన్ని దాటడమే ఇప్పుడు సూర్య ముందున్న అతిపెద్ద సవాల్.