పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్టి.రామస్వామి సైతం మోసపోయారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి రూ.57 లక్షలు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై గత నవంబర్‌లో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

వీడియో కాల్ ద్వారా ఢిల్లీ పోలీసుల యూనిఫాంలో కనిపించిన మోసగాళ్లు, ఎఫ్‌ఐఆర్ కాపీలు చూపిస్తూ తీవ్రంగా బెదిరించినట్లు రామస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరుతో అక్రమ కేసులు నమోదయ్యాయని, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని నమ్మబలికారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆయన దశలవారీగా రూ.57 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత మరో రూ.2.43 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి, స్నేహితుల సూచన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై అధికారులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇదే తరహా మోసంలో దాదాపు రూ.11 కోట్లు కోల్పోయారు. చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని సైబర్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మోసాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీ బాత్‌లో ప్రస్తావించగా, గత రెండేళ్లలో ఇలాంటి స్కామ్‌ల ద్వారా రూ.2,500 కోట్లకు పైగా దోచుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు అప్రమత్తతే ఈ మోసాలకు ప్రధాన ఆయుధమని పోలీసులు సూచిస్తున్నారు.