అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం పది నిమిషాలే ఉన్నాడనే కారణంతో అభిమానులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురయ్యారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేయడంతో పాటు టెంట్లు, బ్యానర్లు, బోర్డులను ధ్వంసం చేశారు. పలు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం ప్రయాణించి వచ్చామని, మ్యాచ్ లేకుండా వెళ్తే ఎలా అంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌పై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కోల్‌కతాలో జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు జనాన్ని పర్యవేక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

మెస్సీ వర్సెస్ సీఎం మ్యాచ్ హైదరాబాద్‌లో భారీ హైప్‌ను సృష్టించింది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వద్ద మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే అనువణువునా తనిఖీ చేసిన తర్వాతే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పెన్నులు, బ్యాటరీలు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు వంటి వాటికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. మెస్సీకి జెడ్ కేటగిరి భద్రత కల్పించడంతో పాటు మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను రంగంలోకి దించారు. కోల్‌కతా ఘటన పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటంతో సాయంత్రానికి ఉప్పల్ స్టేడియం మొత్తం ‘మిస్సీ.. మిస్సీ’ నినాదాలతో మారుమోగనుంది.